
ఏబీఎన్ చానల్‌పై ఫిర్యాదు
గడువు ముగిసినా మంత్రులు, టీడీపీ నాయకులు నంద్యాలలోనే ఉన్నారని వైఎస్సార్ సీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
భన్వర్‌లాల్‌ను కలిసి ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ నేతలు
హైదరాబాద్: గడువు ముగిసినా మంత్రులు, టీడీపీ నాయకులు నంద్యాలలోనే ఉన్నారని వైఎస్సార్ సీపీ నాయకులు మంగళవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కె.శివకుమార్, చల్లా మధుసూదన్ రెడ్డి.. ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞాపనపత్రం సమర్పించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ చానల్‌పైనా ఫిర్యాదు చేశారు. ఇవాళ, రేపు అధికార పార్టీ నేతలు నిర్వహించే విలేకరుల సమావేశాలపైనా కూడా దృష్టి సారించాలని కోరారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రచార గడువు ముగిసినా మంత్రులు, స్థానికేతర టీడీపీ నాయకులు ఇంకా నంద్యాలలో తిష్ట వేశారని ఆరోపించారు. స్థానికేతర నేతలను తక్షణమే అక్కడి నుంచి పంపించాలని ఎన్నికల అధికారిని కోరినట్టు తెలిపారు. ముక్కుపుడకలు, చీరలు, మద్యం కూడా విచ్చలవిడిగా పంచుతున్నారని వెల్లడించారు. ఈసీ ఆదేశాలను పట్టించుకోకుండా సర్వే వివరాలు ప్రసారం చేసిన ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ చానల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
నంద్యాలలో టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే కేబినెట్ అంతా అక్కడ మకాం వేసిందని ఆరోపించారు. అన్నివర్గాల ప్రజలు తమను ఆదరిస్తుండటంతో ఆంధ్రజ్యోతితో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని పేర్కొన్నారు. ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వెంటనే చర్యలు తీసుకోవాలని భన్వర్‌లాల్‌కు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఎవరికి ఓటు వేశారో తమకు తెలుస్తుందని ఓటర్లను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని చెప్పారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని నంద్యాలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని శ్రీకాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు ప్రెస్‌మీట్లను కర్నూలు జిల్లాలో ప్రసారం కానివ్వబోమని భన్వర్‌లాల్ తమకు హామీయిచ్చారని తెలిపారు.