‘తూర్పు’ నివురుగప్పిన నిప్పు
- పోలీసు చక్రబంధంలో ముద్రగడ
- అంబటి సహా పలువురు నేతల నిర్బంధం
సాక్షిప్రతినిధి, కాకినాడ /రాజమహేంద్రవరం: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ‘కాపు సత్యాగ్రహ యాత్ర’ను రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేయడంతో తూర్పు గోదావరి జిల్లా నివురుగప్పిన నిప్పులా మారింది. కాపు నేతల అరెస్టులు, గృహ నిర్బంధాలు రెండో రోజు బుధవారం కూడా కొనసాగారుు. ముద్రగడను పరామర్శించడం కోసం వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, జక్కంపూడి రాజా ప్రభృతులను అరెస్టుచేసి సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్ లో నిర్బంధించారు. తర్వాత అంబటిని గుంటూరుకు బలవంతంగా తరలించారు. ముద్రగడ పద్మనాభంను మంగళవారం నుంచి పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెల్సిందే. డ్రోన్లు, బెల్ట్ కెమెరాలతో ముద్రగడ ఇంటి ప్రాంతాన్ని నిఘా నీడలో ఉంచారు. 2 వేల మంది పోలీ సులు పహారా కాస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ నేతలపై దాష్టీకం..
ముద్రగడను కలిసి ఆరోగ్యం విషయం తెలుసుకునేందుకు రాజమహేం ద్రవరం నుంచి బయలుదేరిన వైఎస్సార్‌సీపీ నేతలు రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పెద్దాపురం కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు, పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్నిలను పోలీసులు ప్రత్తిపాడు జాతీయ రహదారిపై అడ్డగించారు. కారు దింపేసి పోలీసు జీపులో రాజమహేం ద్రవరం రూరల్ బొమ్మూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. సాయం త్రం 6 గంటలకు అంబటి నుంచి జిల్లా నేతలను వేరుచేసి స్టేషన్‌లో మరో గదిలో నిర్బంధించారు. ఆ తరువాత అంబటిని జిల్లాలో ఉండటానికి వీలులేదంటూ ఆదేశిం చారు. అందుకు రాంబాబు నిరాకరిస్తూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు రాంబాబును బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకుని రావులపాలెం వైపు తీసుకువెళ్లిపోయారు. అక్కడి నుంచి గుంటూరు తీసుకువెళ్లారు. కోర్టుకు తీసుకెళ్తా మంటూ వివిధ వాహనాల్లో మార్చి అంబటి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.
ఉద్యమాన్ని ఆపలేరు: అంబటి
పోలీసు బలగాలతో ఉద్యమాలను ఆపలేరని, ఆలా చేస్తే ఉద్యమం మరింత ఉధృతమౌతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హెచ్చరించారు. బొమ్మూరులో అంబటి విలేకరులతో మాట్లాడుతూ కనీసం ముద్రగడను పరామర్శించడానికి అవకాశం లేకుండా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ముద్రగడను ఒంటిరిని చేసి మానసికంగా హింసించాలనుకుంటున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సత్యాగ్రహ పాదయాత్రను ఆపే హక్కు ఎవరికీ లేదని హైకోర్టు తీర్చు చెప్పిందని గుర్తు చేశారు. పోలీసు బలగాలను మోహరించి భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు.