సాక్షి, విశాఖపట్నం : అగ్రిగోల్డ్ బాధితులను మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు సర్కారు చేస్తున్న కుట్రను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పార్టీ నాయకులు, అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. బాధితులకు అండగా తమ పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు కంటి తుడుపు చర్యగా ప్రభుత్వం ప్రకటనలు చేస్తుందే తప్ప చిత్తశుద్ధిగా వ్యవహరించడం లేదని విమర్శించారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘ ప్రతి డిపాజిట్ దారునికి అంచెలంచెలుగా పరిహారం చెల్లిస్తామని అని కుటుంబరావు చెబుతున్నారు. కోర్టుకు చూపించని ఆస్తులకు సంబంధించి ఆయన ఈ నెల 8వ తేదీన అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎటువంటి పురోగతీ లేదు. ఈ కేసులో సీబీసీఐడి దర్యాప్తు లోపభూయిష్టంగా జరిగింది’ అని ఆరోపించారు.
ఇంతటి దౌర్భాగ్యమా?
అగ్రిగోల్డ్ కేసులో కొన్ని ఆస్తులను మాత్రమే కోర్టుకు చూపించి, మిగిలిన ఆస్తులను దోచుకోవాలని చూస్తున్న దౌర్భాగ్య ప్రభుత్వమిదని అప్పిరెడ్డి మండిపడ్డారు. బాధితుల సంఖ్య, వివరాలు, డిపాజిట్ తదితర వివరాలను చెప్పకుండా, అగ్రిగోల్డ్‌కు సంబంధించి వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బాధితులకు ప్రస్తుతం 80 శాతం అంటే రూ.1180 కోట్లు, మిగిలిన 20 శాతం బాండ్ల రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆరునెల్ల కాలంలో తాము డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లిస్తామని పేర్కొన్నారు. నియోజక వర్గాల స్థాయిలో ఈనెల 18న సమావేశాలు నిర్వహించి, బాధితుల్లో మనోధైర్యాన్ని నింపుతామని వెల్లడించారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని, ప్రభుత్వంపై ఉద్యమించడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment