అవనిగడ్డ: ఈ ఏడాది దేశంలో ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరిగినా 8.5 శాతం వృద్ధిరేటు సాధించామని కేంద్రం ప్రకటించగా, రాష్ట్రంలో పదిలక్షల ఎకరాల్లో సాగు పడిపోయి, పప్పుధాన్యాల ఉత్పత్తి దారుణంగా తగ్గితే 14 శాతం వృద్ధిరేటు సాధించామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుని రైతులను మోసం చేస్తోందని వైఎస్‌ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు.
మే 1, 2 తేదీల్లో జగన్ చేపట్టిన రైతు దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ కృష్ణా జిల్లా అశ్వరావుపాలెంలో గురువారం నాగిరెడ్డి పర్యటించి రైతులను సన్నద్ధం చేశారు. అనంతరం అవనిగడ్డలో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో నెలకొన్న కరువుపై అన్ని పత్రికలు కథనాలు రాస్తుంటే, 14 శాతం వృద్ధిరేటు సాధించామని గొప్పలు చెప్పుకోవడం ఎవరిని మోసగించడానికని ప్రశ్నించారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా మినుము పంట సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోతే ఇన్సూరెన్సా? ఇన్‌పుట్ సబ్సిడీనా? రెంటిలో ఒకటే ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఇన్సూరెన్స్ అనేది కంపెనీలు చెల్లించేవని, ఇన్‌పుట్ సబ్సిడీ అనేది రైతులు తీవ్రంగా నష్టపోయినపుడు తరువాత పంట వేసుకునేందుకు విత్తనాలు, ఎరువుల కోసం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అన్నారు. ఇది కూడా తెలియకుండా వ్యహరించడం దారుణమని, దేశంలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రకటించలేదన్నారు.
వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాకపోయినా తెలంగాణలో సాగును పెంచేందుకు, రైతులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకొస్తుంటే, మన ముఖ్యమంత్రి మాత్రం రైతు నోట్లో మట్టికొట్టే కార్యక్రమాలు చేపడుతున్నారని నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. మిర్చి, పసుపుకు క్వింటాల్‌కు రూ.1,500 బోనస్ ధర చెల్లిస్తామని, ఇందుకోసం వీఆర్వోలతో ధృవీకరణ పత్రాలు తీసుకురావాలని నిబంధనలు పెట్టడం దారుణమన్నారు.
ఈ నిర్ణయం టీడీపీ వాళ్లకు లబ్ధిచేకూరేదిగాను, పెద్ద కుంభకోణానికి దారితీసే చర్యగా ఆయన అభివర్ణించారు. గిట్టుబాటు ధర కల్పించాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు మిర్చియార్డులో చేపట్టే రైతు దీక్షకు పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని సూచించారు.