నిర్మాణ దశలోనే ఉన్న ఫ్లై ఓవర్ పనులు
సాక్షి, విజయవాడ : ‘ఏ రాష్ట్రంలోనైనా రాజధాని అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. విజయవాడ రాజధానిగా మారి నాలుగేళ్లయినా చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు రెండుసార్లు స్వయంగా నగరంలో పర్యటించినా ఫలితంలేదని దుయ్యబట్టారు. నగర అభివృద్ధిపై గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకపోవడంపై మండిపడుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా రీజినల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మచిలీపట్నం, విజయవాడ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షులు కొలుసు పార్థసారథి, సామినేని ఉదయభాను, విజయవాడ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్, నాయకులు పైలా సోమినాయుడు, బొప్పన భవకుమార్, ఆసిఫ్, నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ బీఎన్ పుణ్యశీల మంగళవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం కనకదుర్గ ఫ్లై ఓవర్ పనులు పరిశీలించి పెదవి విరిచారు.
సాగని కనకదుర్గ ఫ్లై ఓవర్ పనులు
కనకదుర్గ ఫ్లై ఓవర్ పనులు ఏడాది కిందటే పూర్తి కావాల్సి ఉన్నా 50 శాతం లోపే జరిగాయి. పనులపై అధికారులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి నిర్మాణం పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినా, మరో ఏడాది న్నరకు పూర్తయ్యేలా లేదని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు. పనులను వేగవంతం చేయడంతోపాటు, ఈ మార్గంలో ద్విచక్రవాహనాలు అనుమతించాలని డిమాండ్ చేశారు.
కార్పొరేషన్‌లో అవినీతి
నగరపాలక సంస్థ అవినీతిమయంగా మారిందని, మేయర్, అధికార పార్టీ కార్పొరేటర్లు ఒకరి అవినీతిని మరొకరు బయటపెట్టుకున్నారని, రూ.300 కోట్లు అప్పు మినహా ఈ ఐదేళ్లులో చేసిన అభివృద్ధి ఏమీలేదని విమర్శించారు. కనీసం సిబ్బందికి సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, గుంతలమయంగా మారిన రోడ్లు, వెలగని వీధి దీపాలు, చెత్త కుప్పలు కనిపిస్తున్నాయని చెప్పారు. అధికారపార్టీ నేతల అవినీతిపై పూర్తిస్థాయి విచారణ చేయాలంటూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాశంగా మారింది. విచారణ చేస్తే పుష్కరాల్లో జరిగిన అవినీతి బయటకొస్తుందని పేర్కొన్నారు.
అభివృద్ధికి దూరంగా దుర్గగుడి
దుర్గగుడి అభివృద్ధి మాస్టర్‌ప్లాన్‌కే పరిమితిమైందని, కొండపై ఉన్న భవనాలను కూల్చి చేపట్టిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. రూ.125 కోట్ల అమ్మవారి మూలధనం రూ.50 కోట్లకు తగ్గడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో తాంత్రిక పూజలు, అభివృద్ధిలో వెనుకబాటు ప్రభుత్వం వైఫల్యమేనన్నారు.
జపాన్, చైనాలనుప్రతిబింబించే రాజధాని ఎక్కడ?
అమరావతి ప్రాంతంలో రైతుల వద్ద బలవంతంగా తీసుకున్న 33 వేల ఎకరాల్లో జపాన్, చైనా, కోరియాలను ప్రతిబింబించేలా సీఎం చంద్రబాబు నిర్మిస్తామన్న రాజధాని ఎక్కడని ప్రశ్నించారు. తాత్కాలిక సచివాలయం, శాసనసభ నిర్మించడం మినహా ఏమి నిర్మించారని ప్రశ్నించారు. చంద్రబాబు అనుభవం ఉన్న వ్యక్తిని ప్రజలు ఓట్లు వేసి గెలిసిప్తే రాష్ట్రాన్ని 30,40 ఏళ్లకు వెనక్కు తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలోనే పరిస్థితులు ఇలా ఉంటే మిగిలిన జిల్లాలు ఏవిధంగా ఉంటాయో ప్రజల ఆలోచనకే వదిలేస్తున్నామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment