
అర్హత లేనివారికి ర్యాంకులు కట్టబెట్టే యత్నం
అమరావతి: కష్టపడి చదువుకునే విద్యార్థుల భవిష్యత్‌ను కాలరాసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తోందని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. అర్హత లేనివారికి ర్యాంకులు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై తాము అసెంబ్లీలో ఇవాళ ఉదయం నుంచి చర్చకు పట్టుబడితే... అదేమీ సమస్య కాదని, దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదని చెప్పడం దారుణమన్నారు.
తాము ఆందోళన ఉధృతం చేసిన తర్వాతే లీకేజీ అంశంపై స్టేట్‌మెంట్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని, అయితే అది ఇవాళ కాకుండా, ఎల్లుండి ఇస్తామనడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. సీఎం అందుబాటులోనే ఉన్నా లీకేజీ అంశంపై ఇవాళ ఎందుకు ప్రకటన చేయడం లేదని ఎమ్మెల్యే సురేష్ సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రెండు నిమిషాలు సమయం ఇవ్వాలని, వాస్తవాలు చెబుతామని కోరినప్పటికీ, మాట్లాడేందుకు అవకాశం కల్పించడం లేదన్నారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని అన్నారు. పేపర్ లీకేజీపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, నారాయణ విద్యాసంస్థల యజమాని మంత్రి నారాయణ దీనికి బాధ్యత వహించాలని ఎమ్మెల్యే సురేష్ డిమాండ్ చేశారు.