‘అందుకే హోదాపై బాబు మాట్లాడటంలేదు’
అమరావతి: ప్రత్యేక హోదాపై వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారని, మూడేళ్లు అయినా హోదా హామీని అమలు చేయడం లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ...అసెంబ్లీని టీడీపీ కార్యాలయంగా మారుస్తున్నారన్నారు. ప్రజా సమస్యలను లేవనెత్తితే ఎదురుదాడికి దిగుతున్నారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట్లాడటం లేదని ఆయన అన్నారు.
కేసుల మాఫీ కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక హోదా తీర్మానం చేసిన చంద్రబాబు...ఇవాళ సభలో తీర్మానం ప్రవేశపెట్టడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తేనే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు.