
'నాపై ఏసీపీ దౌర్జన్యకరంగా వ్యవహరించారు'
పాడేరు: వైఎస్సార్‌సీపీ నేత, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భూమా నాగిరెడ్డి అరెస్ట్ అక్రమమని, పోలీసులు ఆయనపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పూనుకుంటున్నారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా పాడేరులో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి పూర్తిగా కొమ్ముకాస్తోందని విమర్శించారు. ఇటీవల విశాఖ కలెక్టరేట్లో తాము ఆందోళన చేసి వినతిపత్రం ఇవ్వాలని వేచివుంటే మహిళా ఎమ్మెల్యేనని కూడా చూడకుండా ఏసీపీ రమణ తనపై దౌర్జన్యకరంగా వ్యవహరించారని ఆమె విమర్శించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రమేయం ఏమీ లేకున్నా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. తెలుగుదేశం పాలనలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోతోందని ఆమె ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఏపీ సీఎం చంద్రబాబు నెరవేర్చలేదని, ఈ విషయంలో ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజలకు అండగా ఉంటున్నారనే అక్కసుతోనే వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసు నిర్బంధాలను ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు.