'ఎన్టీఆర్ పదవీచ్యుతిలో డీజీపీ పాత్రధారి'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా జాస్తి వెంకట రాముడిని నియమించడాన్ని సవాలు చేస్తూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా రాముడి నియామకం జరిగిందని, అందువల్ల ఆయన నియామకపు జీవోను నిలిపేసి, రాముడి కన్నా సీనియర్ అధికారికి డీజీపీ బాధ్యతలు అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ఆయన తన పిటిషన్లో న్యాయస్థానాన్ని కోరారు. ఎన్టీ రామారావును సీఎం పదవి నుంచి దించివేయడంలో సహకరించినందుకే రాముడిని ...చంద్రబాబు డీజీపీగా చేశారని కొడాలి నాని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
గతంలో ఎన్టీ రామారావును గద్దె దించేందుకు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్లో ఉంచారు. ఆ హోటల్ హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలో ఉందని, దానికి డిప్యూటీ కమిషనర్ గా రాముడు వ్యవహిరించారని, తనకు అప్పుడు సహకరించినందుకే చంద్రబాబు...ఇప్పుడు రాముడిని డీజీపీని చేశారని కొడాలి నాని తన పిటిషన్లో పేర్కొన్నారు. వీటన్నింటి దృష్ట్యా రాముడు నిష్పాక్షికంగా పోలీసు బలగాలను నడిపిస్తారనే విశ్వాసం ప్రజలకు కలగడం లేదని, అంతేకాకుండా 1993లో రాముడు పుట్టిన తేదిని సవరించడం జరిగిందని, దానివల్లే ఆయనకు మరో రెండేళ్లపాటు డీజీపీగా కొనసాగే అవకాశం వచ్చిందన్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని డీజీపీగా రాముడు నియామకాన్ని రద్దు చేయాలని, కేసు తేలేంతవరకు డీజీపీ బాధ్యతలను మరో సీనియర్ అధికారికి అప్పిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు.