సాక్షి, మైలవరం: అధికారంలో ఉన్న సమయంలో అడ్డగోలుగా ఇసుక దోచేసిన దేవినేని ఉమా ఇప్పుడు కొత్తగా ఇసుక కొరత అంటూ ధర్నాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎద్దేవా చేశారు. ఇసుక కోసం ధర్నాలు చేసే అర్హత దేవినేని ఉమాకు లేదని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇసుక నుంచి తైలంబు ఎలా తీయవచ్చో దేవినేని ఉమాకు తెలిసినంతగా రాష్ట్ర్రంలో ఎవరికి తెలియదు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఇసుక కోసం ధర్నాలు చేస్తున్నారు’అని అన్నారు.
‘మైలవరం నియోజకవర్గ పరిధిలో నీ ఆధ్వర్యంలో ఇసుక అక్రమ దందాపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ రూ.100 కోట్ల జరిమానా విధించిన సంగతి మరిచిపోయావా’అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో మంత్రి హోదాలో ఉన్న ఉమా అధికారం దుర్వినియోగంతోనే ఆ ప్రాంతంలో ఇసుక అందుబాటులో లేకుండా పోయిందని వెల్లడించారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు.. తప్పు మీద తప్పులు చేస్తున్నారని చురకలంటించారు. సెప్టెంబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ద్వారా అందరికీ ఇసుక అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment