రౌడీల రక్షణకు గన్‌మెన్లా?
- వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల ఆక్షేపణ
- శిల్పా చక్రపాణిరెడ్డిపై కాల్పులకు ఖండన
సాక్షి, చిత్తూరు: కర్నూలు జిల్లా నంద్యాలలో తమ పార్టీ నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ నేత కాల్పులకు తెగబడడాన్ని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు నారాయణస్వామి, సునీల్ కుమార్ ఖండించారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ... రౌడీల రక్షణకు గన్‌మెన్‌లను ఇవ్వడం సబబేనా అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే పోలీసులు ఎందుకు ఆయుధాలు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. కత్తులతో స్వైరవిహారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు చక్రపాణిరెడ్డి లక్ష్యంగా భూమా వర్గీయుడు, రౌడీ షీట్ వున్న అభిరుచి మధు గురువారం తుపాకీతో అయిదు రౌండ్ల కాల్పులు జరిపాడు. అంతేకాకుండా వేట కొడవలితో ఆయనను హెచ్చరిస్తూ వీరంగం సృష్టించాడు.