అభివృద్ధి కోసం నిధులు అడిగితే మోకాలడ్డుతారా
ఒంగోలు సబర్బన్: మండలాల అభివృద్ధి కోసం నిధులడిగితే మోకాలడ్డుతారా అంటూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు టి.డి.పి. సభ్యులపై మండిపడ్డారు. జిల్లా కరువు కోరల్లో అల్లాడుతుంటే గ్రామాలలోని ప్రజలను ఊరట కలిగించేందుకు చిన్నపాటి అభివృద్ధి పనుల కోసం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మండలాలకు నిధులను కేటాయించేందుకు తీర్మానం చేయాలని వైఎస్సార్ సీపీ సభ్యులు అడిగితే తీర్మానం కాకుండా చేసేందుకు టి.డి.పి. సభ్యులు అడ్డుకోవడం మంచి పద్దతి కాదంటూ నిలదీశారు.
ప్రస్తుతం జిల్లాలో స్థాయి సంఘాలు లేకపోయినా సర్వసభ్య సమావేశంలో గ్రామాల అభివృద్ధి కోసం జిల్లా పరిషత్ సాధారణ నిధులను కేటాయించేందుకు తీర్మానం చేయడానికి వైఎస్సార్‌సీపీ సభ్యులు తీర్మానం పెట్టారు. అందుకు టిడిపి సభ్యులు నిధుల కేటాయింపు సరైన పద్ధతి కాదంటూ అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో వైఎస్సార్ సీపీ సభ్యులు ధ్వజమెత్తారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సురేష్ పంచాయతీరాజ్ చట్టంలోని 187 సెక్షన్‌ను ప్రస్తావించి స్థాయి సంఘాలు లేకపోయినా జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేస్తే సాధారణ నిధుల నుంచి మండలాలకు ప్రత్యేకంగా కేటాయించవచ్చని సూచించారు.
దీంతో టి.డి.పి. నేత, బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి అడ్డు తగిలారు. ఆర్ధిక పరమైన అంశాలను తీర్మానం చేసినప్పటికీ ప్రభుత్వ అనుమతి కావాలన్నారు. స్థానిక సంస్థలకు విధులు, నిధులు కేటాయింపుల్లో స్వయం ప్రతిపత్తి ఉందని అందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ ఎంపీని అడ్డుకున్నారు. అప్పటికే సభలోఉన్న టి.డి.పి. ఎమ్మెల్యేలు దామచర్ల జనార్థన్, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, కదిరి బాబూరావులు సభలో లేకపోవడంతో ఏవిధంగానైనా సభలో జరుపతలపెట్టిన తీర్మానాన్ని కాకుండా చేయాలంటూ బాపట్ల ఎంపీ మాల్యాద్రి హైడ్రామా నడిపారు. అందుకు టి.డి.పి. జెడ్పిటీసీ సభ్యులు కూడా ఆయనకు వంతపాడడంతో వైఎస్సార్ సీపీ సభ్యులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే కాలాతీతం కావడం సమయం సాయంత్రం 6.30 గంటలు దాటటంతో ఎక్కువ మంది సభ్యులు సభను వీడి వెళ్లిపోయారు.
దీనిని గమనించిన టి.డి.పి. సభ్యులు వాకౌట్ చేయడమే సరైన పద్దతని నిర్ణయించుకుని వాకౌట్ చేశారు. వాకౌట్ చేసి బయటకు వెళ్లిన తరువాత వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, సభ్యులు మండలాలకు ప్రత్యేక నిధులను కేటాయించే తీర్మానాన్ని చేయాలని జెడ్పీ ఛైర్మన్ డా. నూకసాని బాలాజీపై ఒత్తిడి తెచ్చారు. ఛైర్మన్‌కు సభ్యులకు మధ్య కొంత సేపు వాదనలు కూడా జరిగాయి. తీర్మానం చేయాలన్నా మూడవ వంతు సభ్యుల కోరం అవసరమని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి కాబట్టి తీర్మానం చేయడం కష్టమని తెగేసి చెప్పారు. ఎక్కడ తీర్మానాన్ని ఆమోదింపజేసుకుంటారోనని వాకౌట్ చేసి బయటకు వెళ్లిన టిడిపి సభ్యులు, బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రితో సహా తిరిగి మళ్లీ సమావేశ మందిరంలోకి వచ్చారు. నిబంధనల మేరకు తీర్మానాన్ని ఆమోదించాలి కాబట్టి సభను వాయిదా వేయడం మినహా మరో మార్గం లేదంటూ ఛైర్మన్ సభను వాయిదా వేశారు.
చర్చకు రాకుండానే వాయిదా
ఒంగోలు: జిల్లా పరిషత్ సమావేశంలో మొత్తం 20 శాఖలపై సమీక్షించాలని జిల్లా పరిషత్ చైర్మన్ నిర్ణయించారు. ఈ మేరకు 20 అంశాల అజెండా కాపీని కూడా జిల్లా పరిషత్ సభ్యులందరికీ పంపిణీ చేశారు. జడ్పీ సభ్యులకు సంబంధించి మండల అభివృద్ధికి నిధులు కేటాయించాలనే అంశం చర్చకు వచ్చి మిగిలిన 16అంశాలు చర్చకు రాకుండానే వాయిదాపడ్డాయి. వాయిదాపడ్డ వాటిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, వ్యవసాయశాఖ, ఇరిగేషన్ డిపార్టుమెంట్, ఉద్యానవనశాఖ, పశు సంవర్థకశాఖ, హౌసింగ్ కార్పోరేషన్, జిల్లా పంచాయతీ కార్యాలయం, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్‌శాఖ, స్త్రీ మరియు శిశు సంక్షేమం, విద్యుత్, పౌరసరఫరాలశాఖ, సంక్షేమ శాఖలు మరియు సంక్షేమ వసతి గృహాలు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, రోడ్లు మరియు భవనాల శాఖ, గనులు, భూగర్భశాఖ, సామాజిక అటవీ విభాగంలపై ఎటువంటి చర్చలు జరగకపోవడం గమనార్హం. వీటిలో గనులకు సంబంధించి జిల్లా పరిషత్‌కు వచ్చే ఆదాయంలో కొంత ఆదాయం తమకు కూడా వస్తుందని క్రీడాకారులు భావించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.