సాక్షి, తాడేపల్లి: బీసీలను తెలుగుదేశం పార్టీ వాడుకొని వదిలేసిందని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. అన్ని కులాలకు న్యాయం జరిగేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సంచార జాతిలో ఉన్న కులాలకు బడ్జెట్లో నిధులు కేటాయించారని వెల్లడించారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చెల్లబోయిన వేణుగోపాల్‌తో కలిసి జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశారని పేర్కొన్నారు. సంచార జాతుల ఆవేదనను సీఎం జగన్ విన్నారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. ఆర్థిక పరిపుష్టి కల్పించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం సమావేశం ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకున్నారని తెలిపారు. సమాజంలో మార్పు రావాలన్నదే సీఎం వైఎస్ జగన్ ముఖ్య ఉద్దేశమన్నారు. పేదలందరికీ నాణ్యమైన విద్యనందించాలని, అది కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించాలని సీఎం పట్టుదలతో ఉన్నారన్నారు. చేనేత కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుపై చర్చించారని వెల్లడించారు. కార్పొరేషన్లకు చైర్మన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నామినేటేడ్ పదవులు కూడా 50 శాతం ఇస్తారని చెప్పారు. మార్కెట్ యార్డు, దేవాలయాల్లో పదవులు 50 శాతం ఈ వర్గాలకే ఇస్తారని తెలిపారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేశారని, బీసీ వర్గాలు తమ సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకురావాలని కోరారు. కులాలకు సంబంధించిన ఏ సమస్యనైనా ప్రభుత్వం పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని కృష్ణమూర్తి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment