చంద్రబాబుకు జనం బుద్ధిచెబుతారు
► రాష్ట్రంలో నియంతృత్వ పాలన
► వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం!
► జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ అత్యధిక స్థానాలను గెలుస్తుంది
► పార్టీ మారిన ఎమ్మెల్యేలు సిగ్గుంటే రాజీనామా చేయాలి
► వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పలమనేరు: గతంలో ఎన్నడూ లేనివిధంగా చంద్రబాబు రాష్ట్రంలో నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలంలో శనివారం ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామితో కలసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు జనం త్వరలో గుణపాఠం చెబుతారని అన్నారు. ఆయన ఎన్ని డ్రామాలు ఆడినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు.
బాబు సొంత జిల్లాలో ఆధిపత్యం కోసం ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారనీ, అది తానుండేంతవరకు కుదిరే పని కాదని స్పష్టంచేశారు. తనకు నీతిమాలిన రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. మడమ తిప్పని మహానేత తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేదాకా విశ్రమించే సమస్యే లేదన్నారు. వైఎస్సార్‌సీపీలో గెలిచి ప్రలోభాలకు గురై జిల్లాలో పార్టీ మారిన ఎమ్మెల్యే అమరనాథరెడ్డిని ఓడించడమే తన లక్ష్యమన్నారు. అమర్ తండ్రి రామకృష్ణారెడ్డి కుటుంబంతో తమకు రాజకీయ వైరమున్నా ఆయనకున్న వ్యక్తిత్వం ఆయన తనయునికి లేదన్నారు. నిజంగా పార్టీమారిన వారికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజలముందుకు వెళ్లాలన్నారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి మాట్లాడుతూ పెద్దిరెడ్డి నేతృత్వంలో జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్ చేస్తుందన్నారు. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో పెద్దిరెడ్డిని చూసి నేర్చుకోవాలన్నారు. చంద్రబాబు మాత్రం వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ రాజకీయాన్ని మోసకీయంగా మార్చేశానన్నారు.
పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ మాట్లాడుతూ ఓ పార్టీ ఓట్లతో గెలిచి వాటిని అమ్ముకుని కోట్లు గడించే నాయకులకు జనం బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు రెడ్డెమ్మ, సీవీ కుమార్, రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీకి మోసం చేసిన వారికి తరతరాలు తెలిసొచ్చేలా జనం తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పెద్దపంజాణి మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పలమనేరులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఎవరికిచ్చినా గెలిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శులు కృష్ణమూర్తి, మురళీకృష్ణ, వాసు, సంయుక్త కార్యదర్శులు వెంకటేగౌడ, దయానంద్ గౌడ, మండల కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు.
పెద్దపంజాణి వైఎస్సార్‌సీపీ నాయకులకు పార్టీ పదవులు
పెద్దపంజాణి: పెద్దపంజాణి మండల నాయకులకు వైఎస్సార్‌సీపీలో పదవులు దక్కాయి. శనివారం ఇక్కడికి విచ్చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో పదవులు ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శిగా పెద్దపంజాణి మండల మాజీ ఎంపీపీ విజయభాస్కర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులుగా రాయలపేటకు చెందిన సీనియర్ నాయకులు డా.చంద్రశేఖర్ రెడ్డి, తమ్మిరెడ్డి, జిల్లా మైనారిటీ కార్యదర్శిగా రహంతుల్లా, జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శిగా గుండ్లపల్లి రవికుమార్, మండల కన్వీనర్‌గా బాగారెడ్డిని ప్రకటించారు. తాము పార్టీ కోసం శక్తివంచనలేకుండా కృషిచేస్తామని పదవులు దక్కినవారు తెలిపారు. ఈకార్యక్రమంలో నాయకులు వైఎస్ ఎంపీపీ సుమిత్ర, ఎస్ భాస్కర్‌రెడ్డి, ఆర్ సురేంద్ర, ఎంపీటీసీ సభ్యుడు క్రిష్ణప్ప, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.