
ఆదిలోనే అడ్డం తిరిగారు
బీఏసీలో వైఎస్సార్ సీపీకి చోటుపై అధికారపక్షం తకరారు
నలుగురు సభ్యులున్న బీజేపీకి బీఏసీలో ఒక స్థానం
67 మంది సభ్యులున్న ప్రధాన ప్రతిపక్షం నుంచి ఇద్దరికే అవకాశం కల్పిస్తామని ప్రతిపాదన
కనీసం నలుగురిని అనుమతించాలని కోరిన జగన్‌మోహన్‌రెడ్డి
ససేమిరా అన్న టీడీపీ.. బీఏసీని బహిష్కరించిన వైఎస్సార్ సీపీ
ప్రధాన ప్రతిపక్షం లేకుండానే బీఏసీ భేటీ.. అజెండా ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి సమావేశాల్లోనే ప్రధాన ప్రతిపక్షంతో సమన్వయంతో వెళ్లాల్సిన ప్రభుత్వం ఆదిలోనే కాలుదువ్వింది. శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) ఏర్పాటులో ప్రధాన ప్రతిపక్షానికి ప్రాతినిధ్యం కల్పించే విషయంలో ఏకపక్షంగా వ్యవహరించింది. బీఏసీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌కు తగిన అవకాశం కల్పించకుండా ఆ పార్టీ తరఫున కేవలం ఇద్దరికి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పలుమార్లు ప్రతిపాదనలను మార్చేసింది. దీంతో అధికార టీడీపీ ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ శనివారం జరిగిన బీఏసీ సమావేశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. అధికార పక్షం నుంచి బీఏసీలో ఐదుగురు సభ్యులకు అవకాశం కల్పించి ప్రధాన ప్రతిపక్షమైన తమ పార్టీకి కేవలం ఇద్దరు సభ్యులకు మాత్రమే అవకాశం కల్పించడమేంటని వైఎస్సార్ సీపీ నిరసన తెలియజేసింది.
ఇద్దరు మంత్రులతో కలిపి మొత్తంగా నలుగురు సభ్యులున్న బీజేపీకి బీఏసీలో చోటిచ్చి వైఎస్సార్ సీపీకి మాత్రం ఇద్దరు సభ్యులను మాత్రమే కేటాయిస్తామని చెప్పడమేంటని ఆ పార్టీ ప్రశ్నించింది. అదేమంటే నిబంధనల పేరు చెప్పి తప్పించుకునేందుకు చూస్తోందని ధ్వజమెత్తింది. వైఎస్సార్ సీపీ తరపున ఎన్నికల్లో 67 మంది గెలిచారని గుర్తుచేస్తూ.. బీఏసీలో తమ పార్టీ తరపున నలుగురికి అవకాశం కల్పించాలని ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. కానీ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. తాము నిబంధనల ప్రకారం ఇద్దరికే అవకాశం కల్పిస్తామని చెప్పింది. మరో సభ్యుడిని ప్రస్తుత సమావేశాల వరకూ ప్రత్యేక ఆహ్వానితునిగా అనుమతిస్తామని పేర్కొంది. దీంతో బీఏసీని వైఎస్సార్ సీపీ బహిష్కరించింది.
ముందు నలుగురు సభ్యుల పేర్లు చెప్పమన్నారు...
శాసనసభా కార్యక్రమాల ఖరారు కోసం ఏర్పాటయ్యే బీఏసీ (సభా వ్యవహారాల సలహామండలి)లో మొత్తం 11 మంది సభ్యులుంటారు కనుక ప్రతిపక్ష నేతతో పాటుగా ముగ్గురు పేర్లను ఇవ్వాల్సిందిగా స్పీకర్ నుంచి వైఎస్సార్ సీపీకి తొలుత వర్తమానం అందింది. అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణరావు స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు. నలుగురు పేర్లను ఖరారు చేసే లోపే బీఏసీలో మొత్తం సభ్యుల సంఖ్యను 9 మందికి తగ్గిస్తున్నాం కనుక ప్రతిపక్ష నేతతో పాటుగా మరో ఇద్దరి పేర్లను ఇవ్వాలని రెండోసారి సందేశం అందింది. మళ్లీ ఈలోపే ప్రతిపక్ష నేతతో కలిపి ఇద్దరికే అవకాశమిస్తామని తుదిగా కార్యదర్శి సమాచారం తీసుకువచ్చారు. దీంతో అభ్యంతరం తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం సభ్యులు అసెంబ్లీలో తమ సంఖ్యాబలాన్ని బట్టి నలుగురికి అవకాశం ఇస్తేనే బీఏసీకి వస్తామని చెప్పారు. కనీసం ముగ్గురికి స్థానం కల్పించాలని చేసిన విజ్ఞప్తి కూడా ఫలించలేదు. ప్రతిపక్ష నేతతో పాటు మరొక్కరే బీఏసీకి రావాలని స్పీకర్ నుంచి తుదిగా వర్తమానం అందడంతో వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం బీఏసీ సమావేశానికి దూరంగా ఉండిపోయింది. తొలి సమావేశంలో పాల్గొనాలనే ఉద్దేశంతో చాలా సేపు అసెంబ్లీలోని తన చాంబర్‌లో వేచి చూసిన ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి తమ ఎమ్మెల్యేలతో కలసి అక్కడి నుంచి నిష్ర్కమించారు.
వైఎస్సార్ సీపీ సభ్యుల పేర్లు చెప్పలేదు: కాలువ
స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ భేటీలో ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినే ని ఉమామహేశ్వరరావు, చీఫ్‌విప్‌గా ఎంపికైన కాలువ శ్రీనివాసులు, బీజేపీ పక్ష నేత ఆకుల సత్యనారాయణ సభ్యులుగా ఉంటారని కాలువ ప్రకటించారు. వైఎస్సార్ సీపీ తరఫున సభ్యులుగా బీఏసీలో ఎవరుంటారో తమకు పేర్లు వెల్లడించలేదని కాలువ శ్రీనివాసులు మీడియాకు తెలిపారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఇందులో సభ్యుడిగా ఉంటారు.
సభ జరిగేది మరో రెండు రోజులే
శాసనసభ తొలి సమావేశాలు మరో రెండు రోజులు మాత్రమే జరగనున్నాయి. ఈ మేర కు శనివారం శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశాన్ని వైఎస్సార్ సీపీ బహిష్కరించగా మిగిలిన సభ్యులు హాజరయ్యారు. సోమ, మంగళ వారాలు సభ జరుగుతుంది. తొలుత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని చర్చకు చేపడతారు.