ఓటర్ల జాబితా రూపకల్పనలో భాగస్వామ్యం కావాలి :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
సాక్షి,హైదరాబాద్: కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో తమకూ భాగస్వామ్యం కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌ను కోరింది. మిగతా రాజకీయ పార్టీలకు స్థానం కల్పించినట్టే తమకూ ఈ భాగస్వామ్యం ఇవ్వాలని కోరుతూ, పార్టీ నేతలు బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 10 వరకూ ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా సవరణ చేపడుతున్న నేపథ్యంలో పార్టీ ఈ విజ్ఞప్తి చేసింది. పార్టీ నేతలు శివకుమార్, పీఎన్‌వీ ప్రసాద్, అంబటి రాంబాబు, తోట చంద్ర శేఖర్ ఈ వినతిపత్రం సమర్పించారు.
ఓటర్ల జాబితా రూపకల్పనలో గుర్తింపు పొందిన వివిధ పార్టీల నుంచి బూత్ లెవల్ ఏజెంట్లను, పోలింగ్ బూత్ స్థాయి వలంటీర్లను నియమించారని, గుర్తింపునకు సంబంధించిన సాంకేతిక కారణాల రీత్యా ఈ వెసులుబాటు తమ పార్టీకి ఇవ్వలేదని వారు తెలిపారు. ఓటర్ల జాబి తా డ్రాఫ్ట్ తయారయ్యాక రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లోని ఎన్నికల అధికారులు జరిపే సదస్సులకు గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులను ఆహ్వానించినట్లే తమనూ పిలవాలని, జిల్లాల్లోని ఎన్నికల అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు. తమ వినతిపట్ల భన్వర్ లాల్ సానుకూలంగా స్పందించారని నేతలు తెలిపారు.