అనంత:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు రుణాలు మాఫీ చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలం చెందారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన అనంత వెంకట్రామిరెడ్డి, వై. విశ్వేశ్వర్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డిలు.. రాష్ట్ర ప్రజల పట్ల ఏపీ సర్కారు అవలంభిస్తున్న తీరును తప్పుబట్టారు.
రుణాలను మాఫీ చేయడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం.. కొత్త రుణాలు అందక రైతులు ఇబ్బంది పడుతున్నాపట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. హంద్రీ-నీవా ప్రాజెక్టుపై చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తూ.. తాగునీటి ప్రాజెక్టుగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు.
వేరు శనగ విత్తనాల పంపిణీలో చంద్రబాబు సర్కారు పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలు అక్రమంగా విత్తనాలను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు రుణాలు మాఫీ చేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్లక్ష్యం రాయలసీమ ప్రజల పట్ల శాపంగా మారిందని ఎద్దేవా చేశారు.