బెదిరింపులకు తలొగ్గేది లేదు
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
సాక్షి, హైదరాబాద్: శాసనసభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వడానికి తమ పార్టీ ఎమ్మెల్యేలు ఏం నేరం చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తే నోటీసులిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ప్రయోజనాలు ముడిపడి ఉన్న ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీపడిపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చూస్తూ ఊరుకోవాలా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అధికార టీడీపీ శాసనసభలో ఎన్నో ఘోరాలకు పాల్పడిందని మండిపడ్డారు. మంగళవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ అసెంబ్లీలో చంద్రబాబే రెండుసార్లు తీర్మానం చేశారు.
ఇది కోట్లాది మంది ప్రజల, నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. హోదా ఇవ్వబోమని చెప్పి కేంద్రం అర్ధరాత్రి ప్యాకేజీ ప్రకటించగానే చంద్రబాబు చీకట్లో స్వాగతం పలికారు. దీన్ని మేం శాసనసభలో వ్యతిరేకించాం. అందుకే మా ఎమ్మెల్యేలు బెంచీలు ఎక్కారు, మేమేమీ శాసనసభ గౌరవాన్ని తగ్గించే పని చేయలేదు’ అని చెప్పారు. స్వీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టినపుడు అధికార టీడీపీ అరగంటలో శాసనసభ నిబంధనలు మార్చేసి ఓటింగ్ లేకుండా చేసి ఘోరానికి పాల్పడిందని, ఇలాంటి చర్యలతో శాసనసభ గౌరవం ఇనుమడించినట్లా? అని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి బెదిరింపులకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గేది లేదన్నారు.
నెహ్రూను ఎందుకు తొలగించలేదు
తమ పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంకా ప్రివిలేజ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగించడం ఏ మాత్రం నైతికం కాదని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. నెహ్రూ స్థానంలో తమ పార్టీ తరపున చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించాలని లేఖ రాసినా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదన్నారు.