విద్యానగర్ (గుంటూరు): టీడీపీ నాయకులు మరోసారి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో వివాదం నెలకొనడంతో బుధవారం రాత్రి తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పల్లా సుబ్బారావు, కుక్కల వెంకటేశ్వర రావు, కుక్కల మల్లికార్జునరావు, కుక్కల పద్మ, మదర్‌లపై టీడీపీ నాయకులు దాడిచేసి గాయపర్చారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి, నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి పరామర్శించారు.
రాష్ర్టంలో రౌడీ రాజకీయాలు: అంబటి
ఈ సందర్బంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు జరుగుతున్నాయనటానకి నిదర్శనం ఈ దాడులన్నారు. విచక్షణారహితంగా పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నా ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు సైతం మిన్నకుండిపోవటం దారుణమన్నారు. ఇప్పటికైనా రాజకీయ కుట్రలు మాని ప్రజలకు మేలు చేసేవిధంగా నాయకులు ప్రయత్నించాలని హితవు పలికారు. అప్పిరెడ్డి మాట్లడుతూ ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాలే ఎక్కువకాలం పనిచేస్తాయని, అదే ప్రజలకు ఆగ్రహం కలిగించే విధంగా పాలన కొనసాగిస్తే త్వరలోనే కాలంచెల్లిపోతుందని హెచ్చరించారు. రాక్షసంగా కొట్టి గాయపరిచి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయటం హేయమన్నారు.
మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ విచక్షణారహితంగా కొట్టి గాయపర్చిన వారిపై కేసులు నమోదు చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. టీడీపీ నాయకులు ఇదేవిధంగా వివాదాలకు దిగితే ప్రజల ఆగ్రహంతో తీవ్ర పరినామాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షణ వ్యవస్థను సైతం ప్రజాప్రతినిధులు, నాయకులు వారి చెప్పు చేతల్లో ఉంచుకోవటం విచారకరమన్నారు. బాధితుల పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా బీసీసెల్ కన్వీనర్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, బెల్లంకొండ జెడ్పీటీసీ సభ్యురాలు దేవెళ్ళ రేవతి, సేవాదళ్ జిల్లా కన్వీనర్ కొత్తా చిన్నపరెడ్డి, నాయకులు అశోక్‌రెడ్డి, డి సీతారామిరెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ దాష్టీకం
Published Fri, Sep 5 2014 1:28 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement