
మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తిరుమల : వీఐపీ బ్రేక్ దర్శనంలో మార్పులు చేయడంతో సామాన్య భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు అదనంగా గంటన్నర సమయం లభించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం ఆయన తిరుమలలో ‘మీడియా సెంటర్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు మీడియా ద్వారా అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతిని నిర్మూలిస్తే.. తాము టీటీడీలో అధికారుల సహాయంతో అవినీతిని నిర్మూలిస్తున్నామని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులకు ఆహారం, నీరు అందించడంలో ఎటువంటి లోటు లేకుండా చూస్తామని తెలిపారు. టీటీడీలో ఎక్కడ కూడా లోపాలు లేకుండా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. నేడు సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారని సుబ్బారెడ్డి తెలిపారు.