
వైవీయూకు తరలించాల్సిందే
ప్రొద్దుటూరు టౌన్ : ప్రొద్దుటూరులో ఉన్న యోగివేమన ఇంజినీరింగ్ కాలేజీని కడపలోని యోగివేమన యూనివర్శిటీకి తరలించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆదివారం ఆందోళన చేశారు. పట్టణంలోని పాలిటెక్నిక్ ఆవరణంలో ఉన్న కళాశాల నుంచి వందలాది మంది విద్యార్థులు ర్యాలీగా రాజీవ్‌సర్కిల్ మీదుగా పుట్టపర్తిసర్కిల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై మానవహారంగా కూర్చొని అరగంటకు పైగా నిరసన వ్యక్తం చేశారు.
నల్లబ్యాడ్జీలు నోటికి కట్టుకుని రోడ్డుపైనే కూర్చొని చదువుకుంటూ నిరసన తెలిపారు. కళాశాల ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంలో అధికారులు, పాలకులు విఫలమయ్యారని రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్ కన్వీనర్ భాస్కర్ ఆరోపించారు. కళాశాలను ప్రారంభించే సమయంలో తమ అనుయాయులకు ఉద్యోగాలు వేయించు కోవడంతోనే పాలకులు తమ పని అయిపోయిందనుకుంటున్నారని అన్నారు.
ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు ఆందోళన చేస్తే అదేదో దేశ సమస్య అని ప్రభుత్వం ఆఘమేఘాల పైన స్పందిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న ఒకే ఒక్క ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తూన్నా ఏ ఒక్కరూ పట్టించు కోవడం లేదన్నారు. ఇప్పటికే అనేకమంది విద్యార్థులు వసతులు లేవని కళాశాలలో చేరకుండా వెనక్కివెళ్లిపోయారన్నారు. విద్యార్థుల ఆందోళన కారణంగా ట్రాఫిక్‌కు పెద్ద ఎత్తున అంతరాయం కలిగింది. కార్యక్రమంలో కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.