‘ఆస్కి’లో అంతర్జాతీయ స్థాయి ఎంబీఏ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అంతర్జాతీయ స్థాయిలో డ్యూయల్ డిగ్రీ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రాంను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) అక్టోబరులో ప్రారంభిస్తోంది. కోర్సు కాల వ్యవధి 18 నెలలు. ఇందులో భాగంగా అభ్యర్థులకు నెల రోజులపాటు యూరప్‌లోనూ బోధన ఉంటుంది. మొత్తంగా 15 వారాలు మాత్రమే తరగతులకు హాజరైతే చాలు. విద్యనభ్యసించే వారికి, వారు పనిచేస్తున్న కంపెనీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకే ఈ విధంగా కోర్సును డిజైన్ చేశారు. సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లపై లోతైన అవగాహన, వ్యాపార అవకాశాలు, ఆచరణీయ వ్యూహరచన, వాస్తవ పరిష్కారాలపై బోధన ఉంటుందని ఆస్కి సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలిపారు.