
కష్టార్జితాన్ని ప్రశ్నించటం ప్రమాదకరం
కష్టపడి సంపాదించిన ఆస్తుల చట్టబద్ధతను ప్రశ్నించడం సరికాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు.
♦ అక్రమ-సక్రమ సంపాదనల్ని ఒకేలా చూడొద్దు
♦ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు
ముంబై: కష్టపడి సంపాదించిన ఆస్తుల చట్టబద్ధతను ప్రశ్నించడం సరికాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. దీన్నొక ప్రమాదకర ధోరణిగా అభివర్ణించారాయన. ‘‘అక్రమ ఆర్జనకు, కష్టపడి సంపాదించిన దానికి తేడా ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చిన సంపద కూడా కష్టార్జితమే. వీటిని గురించి వెల్లడించేటపుడు ఈ తేడాలు గమనించాల్సిన అవసరం ఉంది’’ అని రాజన్ పేర్కొన్నారు. పనామా పత్రాలు సృష్టిస్తున్న ప్రకంపనల నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) గురువారమిక్కడ నిర్వహించిన ‘2016 సింగపూర్ సింపోజియం’లో ఆయన మాట్లాడారు. ‘ఒక వ్యక్తి సంపద ఏ తరహాది అయినప్పటికీ (అక్రమం లేదా సక్రమం) అది అక్రమమైనదేనన్న వాదన బలంగా వినపడుతోంది.
పనామా తరహా ఘటనలు వెలుగుచూసినపుడు ఈ అభిప్రాయాలు మరింత బలపడుతున్నాయి. అయితే అక్రమ-సక్రమ ఆర్జనలు రెండింటినీ ఒకేగాటన కట్టి చర్చించడం చాలా ప్రమాదకరమైన ధోరణి అన్నది నా అభిప్రాయం’ అని రాజన్ వివరించారు. ఇలాంటి సందర్భాల్లో ఆయా వ్యక్తులకు తమ సంపద సరైనదేనని నిరూపించుకోడానికి తగిన అవకాశాలివ్వాలని రాజన్ చెప్పారు. పూర్తి స్థాయి పారిశ్రామిక దేశాల్లో ఈ తరహా వ్యవస్థ పటిష్టంగా ఉందని చెప్పారాయన. ‘‘ఒకప్పుడు బ్యాంకర్లు, పారిశ్రామిక వర్గాలు అక్రమ మార్గంలో డబ్బు సంపాదిస్తారనే ఆలోచన ఉండేది. ఇపుడు కష్టపడి డబ్బు సంపాదించుకుంటున్న వారిపైనా ఇలాంటి అభిప్రాయం తలెత్తుతోంది’’ అని చెప్పారాయన. అక్రమ ఆస్తులను దాచిపెట్టేవారిని ఆర్‌బీఐ ఒక కంట కనిపెడుతూనే ఉంటుందని, వారిపై తగిన చర్యలను తీసుకుంటుందని ఆర్‌బీఐ చీఫ్ స్పష్టం చేశారు.
సింగపూర్ డిప్యూటీ ప్రధాని తార్‌మన్ షణ్ముగరత్నం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త బ్యాంకులతో సేవలు మరింత విస్తరిస్తాయని రాజన్ అభిప్రాయపడ్డారు. 11 పేమెంట్ బ్యాంకులకు, 10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు గత ఏడాది ఆర్‌బీఐ సూత్రప్రాయంగా అనుమతివ్వటం తెలిసిందే. కాగా బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరుచుకోవడానికిచ్చిన ‘2017 మార్చి’ గడువును పొడిగించే ప్రతిపాదన లేదని చెప్పారు.
కాగా ద్రవ్య, పరపతి విధానాలకు ప్రపంచ వ్యాప్తంగా నిర్దిష్ట మార్గదర్శకాలు అవసరమన్న రాజన్ అభిప్రాయంతో సింగపూర్ డిప్యూటీ ప్రధాని ఏకీభవించారు. ఆర్థిక ఏకీకరణ ప్రపంచంలో ఈ తరహా వ్యవస్థను అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.