సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చేందుకు మరో రెండేళ్లు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ, టెలికాం పరిశ్రమల్లో ప్రణాళికాబద్ధంగా చేపట్టాల్సిన పనులపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావంతో విపరీత జాప్యం చోటుచేసుకుంటోంది. టెలికాం శాఖ 5జీ వేలంపై ఇటీవల నిర్వహించిన సమావేశంలో 5జీ వేలం ప్రక్రియ 2021లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చర్చ సాగింది. వేలం ప్రక్రియలో జాప్యం జరిగితే అది 5జీ పరీక్షలు సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాల్సిన లాంఛనాలు పూర్తయి 5జీ వాణిజ్య సేవలు 2022లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఆర్థిక వ్యవస్థ మందగమనంతో పాటు భారత్‌లో 5జీ స్పెక్ట్రమ్ బేస్ ధర యూనిట్‌కు రూ 492 కోట్లుగా నిర్ణయించడం టెలికాం ఆపరేటర్లకు ప్రధాన అవరోధంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో బేస్ ధర అత్యధికంగా ఉందని టెలికాం దిగ్గజాలు వొడాఫోన్-ఐడియా, భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు భారత 5జీ ప్రణాళికల్లో చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలు హువేయి, జడ్‌టీజీల పాత్రపై కొనసాగుతున్న అనిశ్చితి సైతం భారత్‌లో 5జీ ఎంట్రీని సంక్లిష్టం చేస్తున్నాయని ఓ వార్తాసంస్థ కథనం పేర్కొంది.
చదవండి : 5జీ టెక్నాలజీ: కొత్త తరం కార్లు
భారత్‌లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మౌలిక సేవల కోసం చైనా కంపెనీలు హువేయి పాత్ర సందేహాస్పదంగా మారింది. అమెరికా చేపట్టిన చైనా వ్యతిరేక విధానంతో పలు దేశాలు హువేయి ద్వారా 5జీ మౌలిక సేవలను పొందేందుకు సానుకూలంగా లేవు. భారత్‌లో ఇప్పటికే టెలికాం రంగంలో తీవ్ర పోటీతో స్వల్ప మార్జిన్లతో నెట్టుకొస్తున్న టెలికాం ఆపరేటర్లు 5జీ సేవల కోసం భారీ నిధులను వెచ్చించేందుకు సిద్ధంగా లేరు. కోవిడ్-19 విపత్తు నేపథ్యంలో మొబైల్ యూజర్ల నుంచి ఖరీదైన 5జీ ప్లాన్స్‌కు ఆదరణ ఎంతమేరకు ఉంటుందనేది కూడా టెలికాం ఆపరేటర్లను ఆలోచనలో పడవేశాయి. ఇక 5జీ సేవలు ప్రధానంగా పారిశ్రామిక అప్లికేషన్స్‌కు ఉపయుక్తమని, సాధారణ యూజర్లకు 5జీ ప్రయోజనాలు పరిమితమే. ఈ పరిస్థితులను బేరీజు వేసి టెలికాం శాఖ 5జీ ఎంట్రీని మరో ఏడాది పాటు జాప్యం చేస్తోందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment