బ్లూస్టార్ శ్రీసిటీ ప్లాంటు ఏడాదిలో సిద్ధం
⇒ జమ్ము ప్లాంటు మరింత ఆలస్యం
⇒ రెండు చోట్లా స్థల సేకరణ పూర్తి
⇒ ప్లాంట్లకు రూ.370 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏసీలు, కమర్షియల్ రిఫ్రిజిరేషన్ రంగ సంస్థ బ్లూ స్టార్ ప్రతిపాదిత జమ్ము ప్లాంటు ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జూలై నుంచి జీఎస్టీ అమలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్సైజ్ పన్ను మినహాయింపు విషయమై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. జమ్మూ, కశ్మీర్‌లో ఏర్పాటయ్యే తయారీ ప్లాంట్లకు జీఎస్టీ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పరిహారాన్ని భరించేది కేంద్రమా, రాష్ట్ర ప్రభుత్వమా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుండటం, మరోవైపు తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో కంపెనీ పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో మొదట ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీసిటీ సెజ్‌లో ప్లాంటు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ఆలోచన బోర్డు ముందుకు వచ్చింది.
స్థల సేకరణ పూర్తి...
జమ్ముతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ప్లాంటు ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు శ్రీసిటీలో స్థలాన్ని సైతం బ్లూ స్టార్ సమీకరించింది. తొలుత జమ్మూ ప్లాంటు రెడీ అవుతుందని కంపెనీ ప్రకటించింది. తాజా పరిస్థితుల్లో శ్రీసిటీ ప్లాంటు నిర్మాణం తొలుత చేపట్టాలని భావిస్తున్నా... మార్చిలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది. కంపెనీకి ఉన్న అయిదు ప్లాంట్లు పశ్చిమ, ఉత్తర భారత్‌కే పరిమితమయ్యాయి. సెన్ వ్యాట్, ఎక్సైజ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేసింది. దక్షిణాదికి ఉత్పత్తుల రవాణాకు ఏటా రూ.150 కోట్లపైనే వ్యయం అవుతోంది. శ్రీసిటీ ప్లాంటుతో 65 శాతం దాకా రవాణా వ్యయాలు ఆదా అవుతాయి.
2018 జనవరి నాటికి..
కంపెనీ శ్రీసిటీవైపు మొగ్గు చూపితే 2018 జనవరికల్లా ప్లాంటు సిద్ధం అవుతుందని బ్లూ స్టార్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సీపీ ముకుందన్ మీనన్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. ఎయిర్ కండీషనర్లతోపాటు, వాటర్ కూలర్స్, డీప్ ఫ్రీజర్లను సైతం ఈ ప్లాంట్లలో తయారు చేస్తామన్నారు. ఒక్కో ప్లాంటుకు రూ.185 కోట్ల దాకా పెట్టుబడి పెడతామని పేర్కొన్నారు. ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10–12 లక్షల యూనిట్లు ఉంటుందన్నారు. ప్రస్తుతం రూమ్ ఏసీల విభాగంలో కంపెనీ వార్షిక తయారీ సామర్థ్యం 5 లక్షల యూనిట్లు. 2016లో సంస్థ 4.5 లక్షల యూనిట్లను విక్రయించింది. 2017లో మార్కెట్ కంటే అధిక వృద్ధి ఆశిస్తోంది.