బ్రాడ్‌బ్యాండ్‌పై ఎయిర్‌టెల్ ఫోకస్..
కొత్త కస్టమర్లకు 30 శాతం వరకు తగ్గింపు
- పాత కస్టమర్లకు అదనపు డేటా, అధిక స్పీడ్
- ఎయిర్‌టెల్ సర్కిల్ సీఈవో వెంకటేష్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ ఎయిర్‌టెల్ ఇప్పుడు హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌పై ఫోకస్ చేసింది. భారత్‌లో ఈ విభాగం ఏటా 15-20 శాతం వృద్ధి చెందుతుండడంతో కంపెనీ వ్యూహాత్మకంగా రంగంలోకి దిగింది. కొత్త కస్టమర్లకు హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ధర 30 శాతం వరకు తగ్గించింది. అలాగే ఎయిర్‌టెల్ సర్‌ప్రైసెస్ పేరుతో పాత కస్టమర్లకు ప్లాన్ ధరలో మార్పు లేకుండా అధిక స్పీడ్, డేటాను అందిస్తోంది. సర్‌ప్రైసెస్‌లో కస్టమర్లు అధిక స్పీడ్ లేదా అదనపు డేటాను ఎంచుకోవచ్చు. స్పీడ్ విషయానికి వస్తే వ్యక్తిగత బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు 16 ఎంబీపీఎస్ వరకు ఆఫర్ చేస్తోంది. హైదరాబాద్‌సహా దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ఎయిర్‌టెల్ ఈ ఆఫర్లను సోమవారం ప్రకటించింది.
మొబైల్‌తోపాటు బ్రాడ్‌బ్యాండ్..
మొబైల్‌లో ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య భారత్‌లో సుమారు 21 కోట్లుంది. వీరిలో 20 శాతం మంది బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ సైతం తీసుకున్నట్టు అంచనా. పోస్ట్ పెయిడ్ మొబైల్ వినియోగదార్లలో 70 శాతం మందికి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉంది. ఇంతటి అవకాశాలు ఉన్నాయి కాబట్టే ఈ విభాగంపై దృష్టిపెట్టామని ఎయిర్‌టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సీఈవో వెంకటేష్ విజయ్‌రాఘవన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కస్టమర్లకు మరింత చేరువ య్యేందుకే ఇంటర్నెట్ స్పీడ్ పెంచామని, చార్జీలను తగ్గించామన్నారు. దేశంలో హైదరాబాద్‌లోనే బ్రాడ్‌బ్యాండ్ చార్జీలు తక్కువని చెప్పారు. భారత్‌లో సగటున ఒక్కో కస్టమర్ బ్రాడ్‌బ్యాండ్‌కు నెలకు సుమారు రూ.850-900 చెల్లిస్తున్నారని ఆయన వివరించారు.
అపార్ట్‌మెంట్లకు 100 ఎంబీపీఎస్..
ఫైబర్ టు హోమ్ సేవలను ఎయిర్‌టెల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో హైటెక్ సిటీ వద్ద ప్రారంభించింది. ప్రస్తుతం నాలుగు భారీ అపార్ట్‌మెంట్లకు కనెక్షన్ ఇచ్చింది. కస్టమర్లు 100 ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్‌బ్యాండ్ పొందుతారు. నెలవారీ రెంటల్ రూ.2,499 నుంచి ప్రారంభం. ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు తమ ల్యాండ్‌లైన్ నుంచి సూపర్ సేవర్ వాయిస్ ప్యాక్స్ ద్వారా అపరిమిత ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. లోకల్ కాల్స్ కోసం నెలకు రూ.49, లోకల్, ఎస్టీడీ కాల్స్ కోసం రూ.99 చెల్లించాలి. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు దేశవ్యాప్తంగా 10 కోట్లు ఉన్నాయి.