అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ (ఫైల్ ఫోటో)
బెంగళూరు : ట్రైయాంగిల్ లవ్ అంటే ఇదేనేమో.. అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతుంటే... ఫ్లిప్‌కార్ట్ మాత్రం గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌లో చేతులు కలిపేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచ కుబేరుడు, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేయాలని అన్వేషాత్మక చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. 20 బిలియన్ డాలర్లను వెచ్చించి, ఫ్లిప్‌కార్ట్‌ను తన సొంతమే చేసుకోవాలని అమెజాన్ చూస్తున్నట్టు మింట్ బిజినెస్ న్యూస్‌పేపర్ రిపోర్టు చేసింది. అయితే దేశీయ ఈ-కామర్స్ స్పేస్‌లో అమెజాన్‌తో ఎల్లప్పుడూ పోటీపడే ఫ్లిప్‌కార్ట్ ఈ ఆఫర్‌కు ఏ మాత్రం ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. వాల్‌మార్ట్‌తోనే భాగస్వామ్యం ఏర్పరుచుకోవాలని ఫ్లిప్‌కార్ట్ చూస్తుందని తెలిసింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటా కొనుగోలు చేయడానికి వాల్‌మార్ట్ కూడా అన్ని సిద్ధం చేసుకుంటోంది. ఈ రెండు కంపెనీల చర్చలు కూడా తుది దశకు వచ్చినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి.
ప్రపంచ ఈ-కామర్స్ మార్కెట్‌లో భారత్‌కు ప్రముఖ స్థానముంది. అమెరికాను వదులుకున్న మాదిరిగా ఈ పాపులర్ మార్కెట్‌ను అమెజాన్ ఇండియాకు వదిలేయకూడదని వాల్‌మార్ట్ భావిస్తోంది. అమెజాన్‌కు చెక్ పెట్టడానికి వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడిదారులు కూడా ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్‌లో తమ అన్ని షేర్లను విక్రయించాలని ప్లాన్‌చేస్తున్నారు.
కాగ, అమెజాన్ మాజీ ఉద్యోగులైన బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్‌లు 2007లో భారత్‌లో ఈ ఫ్లిప్‌కార్ట్ సంస్థను ఏర్పాటుచేశారు. అనంతరం దేశీయ ఆన్‌లైన్ రిటైల్‌లో 40 శాతం వాటాను ఈ సంస్థ దక్కించుకుంది. అమెజాన్‌ను మించిపోయి ఫ్లిప్‌కార్ట్ భారత్‌లో తన సత్తా చాటుతోంది. ఫ్లిప్‌కార్ట్‌కు ఎప్పడికప్పుడూ పోటీ ఇవ్వడానికి అమెజాన్ తీవ్ర కృషిచేస్తూనే ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌కు మెజార్టీ వాటా దక్కితే, అమెజాన్ మరింత పోటీకర వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది. కేవలం అమెజాన్, వాల్‌మార్ట్ మాత్రమే కాక, ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడులు పెట్టడానికి గూగుల్ కూడా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment