న్యూఢిల్లీ: భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్.. భారత్‌కు పెద్ద ఉపకారమేమీ చేయడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్ గోయల్ వ్యాఖ్యానించారు. పోటీ సంస్థలను దెబ్బతీసేటువంటి రేట్లతో అమ్మితే భారీ నష్టాలు రాక.. లాభాలెలా వస్తాయంటూ ప్రశ్నించారు. భారత చట్టాలను ఈ–కామర్స్ కంపెనీలు త్రికరణ శుద్ధిగా పాటించాల్సిందేనని గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గోయల్ స్పష్టం చేశారు. చట్టాల్లో లొసుగులను అడ్డం పెట్టుకుని మల్టీ–బ్రాండ్ రిటైల్ రంగంలోకి దొడ్డిదారిన చొరబడదామనుకుంటే కుదిరే ప్రసక్తే లేదన్నారు. భారత పర్యటనలో ఉన్న అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ప్రభుత్వ వర్గాలతో కూడా సమావేశం కానున్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘ఈ–కామర్స్ మార్కెట్ ప్లేస్ అనేది కొనుగోలుదారులు, విక్రేతలను అనుసంధానం చేసే ఐటీ ప్లాట్‌ఫాం మాత్రమే. ఇలాంటి ప్లాట్‌ఫాం అందించే సంస్థకు ఎందుకు భారీ నష్టాలు వస్తున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారత్‌లో ఆ సంస్థ (అమెజాన్) బిలియన్ల కొద్దీ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఆ క్రమంలో బిలియన్ల కొద్దీ డాలర్ల నష్టాలు వస్తే వాటిని కూడా భరించక తప్పదు. ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా భారత్‌కు ఆ సంస్థ ఏదో ఒరగబెడుతోందని అనుకోవడానికి లేదు‘ అని గోయల్ వ్యాఖ్యానించారు. సముచితమైన విధానాలను పాటిస్తూ, 10 బిలియన్ డాలర్ల పైగా టర్నోవరు సాధిస్తున్న కంపెనీ.. బిలియన్ డాలర్ల కొద్దీ నష్టాలు నమోదు చేస్తోందంటే కచ్చితంగా సందేహాలు వస్తాయని ఆయన చెప్పారు. అనుచిత వ్యాపార విధానాలో లేదా పోటీ సంస్థలను దెబ్బతీసేటువంటి రేట్లతో అమ్మితేనో తప్ప ఇంత భారీ నష్టాలు రావన్నారు. అధికారుల విచారణలో ఈ సందేహాలన్నింటికీ సమాధానం దొరకగలదని ఆశిస్తున్నట్లు గోయల్ చెప్పారు. భారీ డిస్కౌంట్లు, విక్రేతలతో ఒప్పందాలు వంటి అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయన్న ఆరోపణలతో ఈ–కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై కాంపిటీషన్ కమిటీషన్ (సీసీఐ) ఇటీవలే విచారణకు ఆదేశించింది.
భారత్‌కు ఉపకారమేమీ చేయడం లేదు..
Published Fri, Jan 17 2020 6:38 AM | Last Updated on Fri, Jan 17 2020 6:38 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment