రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులకు రెడీ: యూఎస్ఐబీసీ
మోదీ ప్రపంచానికే అదర్శం: జాన్ చాంబర్స్
భారత్‌లో పెట్టుబడులకు అమెరికా కంపెనీలు అత్యంత ఉత్సాహంతో ఉన్నాయని యూఎస్‌ఐబీసీ చైర్మన్ జాన్ చాంబర్స్ పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లలోపే తమ సభ్య కంపెనీలు దాదాపు 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని.. వచ్చే 2-3 ఏళ్లలో అదనంగా మరో 45 బిలియన్ డాలర్లకుపైగా (దాదాపు రూ.3 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చాంబర్స్ ప్రకటించారు. ‘డిజిటల్ ఇండియాతో పాటు కీలకమైన ఆర్థిక సంస్కరణల అమల్లో ప్రధాని మోదీ చూపిస్తున్న చొరవ ప్రశంసనీయం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. అమెరికా పెట్టుబడులు భారీగా పెరిగే అవకాశం ఉంది.
రెట్టింపు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మోదీ దార్శనికతతో భారత్ ఇప్పుడు సరికొత్త వృద్ధి పథంవైపు అడుగులేస్తోంది. ప్రపంచంలో చాలా మంది దేశాధినేతలను కలిసే అవకాశం నాకు లభించింది. అయితే, మోదీ కార్యదక్షతను చూస్తుంటే వచ్చే ఐదేళ్లపాటు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్న దేశంగా భారత్ కొనసాగుతుందని భావిస్తున్నా. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి, ఉద్యోగావకాశాల సృష్టితో పాటు ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా మోదీ సమర్థంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఒక్క వర్ధమాన దేశాలకు మాత్రమే కాదు మొత్తం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు’ అని చాంబర్స్ కొనియాడారు.
మరో 3 బిలియన్ డాలర్లు వెచ్చిస్తాం: అమెజాన్
భారత్‌లో మరో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పేర్కొంది. 2014లో ప్రకటించిన 2 బిలియన్ డాలర్లను కలుపుకుంటే.. తమ మొత్తం పెట్టుబడులు 5 బిలియన్ డాలర్లను చేరుతున్నాయని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్ చెప్పారు. యూఎస్‌ఐబీసీ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డును అందుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘భారత్‌లో ఇప్పటికే మేం 45,000 ఉద్యోగాలను కల్పించాం. ఆర్థిక వ్యవస్థ వృద్ధి జోరు కొనసాగనుంది. మా అమెజాన్ ఇండియా బృందం అనేక ప్రతిష్టాత్మక మైలురాళ్లను అధిగమించింది కూడా’ అని బెజోస్ చెప్పారు.
మూడేళ్లలో 5 బిలియన్ డాలర్లు: స్టార్ ఇండియా
ట్వంటీఫస్ట్ సెంచురీ ఫాక్స్ అనుబంధ సంస్థ స్టార్ ఇండియా కూడా భారత్‌లో భారీ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించింది. వచ్చే మూడేళ్లలో అదనంగా 5 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నామని స్టార్ ఇండియా చైర్మన్, సీఈఓ ఉదయ్ శంకర్ చెప్పారు. ‘భారత్ మార్కెట్లో అపారమైన అవకాశాలున్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెడుతున్న బడా విదేశీ ఇన్వెస్టర్లలో మేం కూడా ఉన్నాం. మీడియా-ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో అతిపెద్ద ఇన్వెస్టర్‌గా నిలుస్తున్నాం’ అని శంకర్ చెప్పారు.