ఆంధ్రా బ్యాంక్ చైర్మన్...ఎంపిక మళ్లీ మొదటికి
చైర్మన్‌గా ఉండటానికి
నిరాకరించిన బి.సాంబమూర్తి
తెలుగువాడిగా రాజకీయ, వ్యాపార
ఒత్తిళ్ళు ఉంటాయన్న భయమే కారణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ ఎంపిక ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. చైర్మన్ పదవి కోసం ఈ రంగంలో అపార అనుభవం ఉన్న కార్పొరేషన్ బ్యాంక్ మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ బి. సాంబమూర్తిని ఎంపిక చేస్తే ఆ పదవిని స్వీకరించడానికి ఆయన మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. ఈ పదవికి ఎంపిక చేసినందుకు కృతజ్ఞత చెపుతూనే సాంబమూర్తి ఈ పదవిని సున్నితంగా తిరస్కరించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ‘‘ఒక తెలుగువాడిగా ఈ పదవిని చేపడితే నా పైన స్థానిక వ్యాపారాలు, రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయని, ఈ సమయంలో ఆంధ్రా బ్యాంక్ చైర్మన్‌గా పదవి చేపట్టలేనని’ సాంబమూర్తి ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలియచేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ పదవి ఎంపిక మొదటికొచ్చినట్లు అయ్యింది.
భారీ నిర్థక ఆస్తులకు తోడు, రాష్ట్ర విభజనతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల వివాదాల నేపథ్యంలో ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ పదవిని చేపట్టడానికి చాలామంది విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఫ్రభుత్వ ఖాతాల నిర్వహణ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు నెలకొన్న విషయం విదితమే. గత ఏప్రిల్ 30న సీఎండీగా సి.వి.ఆర్ రాజేంద్రన్ పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.కె కల్రాను మూడు నెలలపాటు తాత్కాలిక ఎండీ,సీఈవోగా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రాబ్యాంక్‌తో పాటు సుమారు పది ప్రభుత్వరంగ బ్యాంకుల చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.