
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ పదవికి అభ్యర్థి ఎంపిక ఇండియా కూటమిలో చిచ్చు పెట్టింది. ప్రతిపక్షాల తరపున స్పీకర్ పదవికి కె.సురేష్‌ను కాంగ్రెస్ ఏకపక్షంగా ఎంపిక చేసిందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపిస్తోంది.
స్పీకర్ పదవికి కె.సురేష్‌ను పోటీపెట్టేముందు తమను సంప్రదించలేదని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌బెనర్జీ పార్లమెంటు బయట మంగళవారం(జూన్25) మీడియాకు తెలిపారు.
‘మమల్ని ఎవరూ సంప్రదించలేదు. చర్చ జరగలేదు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఏకపక్షంగా కె.సురేష్‌ను స్పీకర్ పదవికి పోటీలో నిలబెట్టింది’అని అభిషేక్ బెనర్జీ మీడియాకు చెప్పారు. ఈ పరిణామంతో తృణమూల్ కాంగ్రెస్ స్పీకర్ ఎన్నికలో పాల్గొంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
కాగా, 18వ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక బుధవారం(జూన్26) జరగనుంది. స్పీకర్ ఎన్నికకు సహకరించాల్సిందిగా ప్రతిపక్షాలను బీజేపీ కోరినప్పటికీ అవి అంగీకరించలేదు. సాంప్రదాయానికి విరుద్ధంగా డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ప్రతిపక్షానికి ఆఫర్ చేయకపోవడంతో స్పీకర్ పదవికి ప్రతిపక్షాలు అభ్యర్థిని పోటీ పెట్టాయి.