మొబైల్ తయారీ హబ్‌గా ఏపీ! | AP Mobile manufacturing hub! | Sakshi
Sakshi News home page

మొబైల్ తయారీ హబ్‌గా ఏపీ!

Published Fri, Jul 17 2015 12:06 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

మొబైల్ తయారీ హబ్‌గా ఏపీ!

మొబైల్ తయారీ హబ్‌గా ఏపీ!

శ్రీసిటీలో ప్లాంటు; ఉత్పత్తి ఆరంభించిన ఫాక్స్‌కాన్
♦ {పస్తుతానికి 55వేల చదరపుటడుగుల్లో ప్లాంటు
♦ మున్ముందు మరింత భూమి తీసుకుని అక్కడే విస్తరణ
♦ భవిష్యత్తులో యాపిల్ సహా పలు ఫోన్ల తయారీ
♦ గుజరాత్‌లో మరో ప్లాంటు!
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇండియాలో మొబైల్ ఫోన్ల తయారీకి ఆంధ్రప్రదేశ్‌ను ప్రధానమైన హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రఖ్యాత సెల్‌ఫోన్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ యోచిస్తోంది. దాదాపు రెండున్నర నెలల కిందట ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ప్లాంటు ఆరంభించడానికి సన్నాహాలు మొదలుపెట్టిన ఈ సంస్థ... ఈ రెండున్నర నెలల వ్యవధిలో ప్లాంటులో యంత్రాలను అమర్చటమే కాక ఉత్పత్తిని కూడా మొదలు పెట్టేసింది. తొలివిడతగా షావొమీ (కంపెనీ ఇలాగే పిలవాలని చెబుతోంది), ఇన్‌ఫోకస్ ఫోన్లను తయారు చేస్తున్నట్లు, తొలి విడత  కన్‌సైన్‌మెంటును కూడా రెండ్రోజుల కిందట బయటకు పంపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రఖ్యాత యాపిల్ ఫోన్లతో పాటు సోనీ తదితర సంస్థల మొబైల్స్‌నుకూడా ఫాక్స్‌కాన్ కాంట్రాక్టు మేరకు తయారు చేస్తోంది. దీంతో ఇండియాలో అమ్ముడయ్యే ఈ సంస్థల ఫోన్లన్నిటినీ ఇకపై శ్రీసిటీలోనే తయారు చేసే అవకాశం ఉందని ఫాక్స్‌కాన్ వర్గాలు తెలిపాయి.

 రెండున్నర నెలల్లోనే ఉత్పత్తి...
 చైనాలో లేబర్ ధర విపరీతంగా పెరిగిపోవటం, తయారీకయ్యే ఖర్చు కూడా ఇపుడు పెరగటంతో చైనాకు వెలుపల భారీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని గత కొన్ని నెలలుగా ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. మొదట గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని భావించి... అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీసిటీతో పాటు విశాఖపట్నంలోని కొన్ని స్థలాలను చూపించింది. అయితే కొన్నేళ్ల కిందట ఆరంభమైన శ్రీసిటీలో మౌలిక సదుపాయాలన్నీ ఉండటంతో పాటు అక్కడి యాజమాన్యం రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీ (ఆర్‌బీఎఫ్) పేరిట షెడ్లు నిర్మించి అన్ని సౌకర్యాలూ కల్పిస్తోంది.

వీటిలో కంపెనీలు నేరుగా తమ యంత్రాలను తీసుకొచ్చి ఇన్‌స్టాల్ చేసకుని, ఉత్పత్తిని ప్రారంభించే అవకాశముంటుంది. శ్రీసిటీ చెన్నైకి దగ్గరగా ఉండటం, ఇక్కడికి ఇప్పటికే పలురకాల కంపెనీలు వచ్చి కార్యకలాపాలు సాగిస్తుండటం, కృష్ణపట్నం పోర్టు కూడా సమీపంలోనే ఉండటంతో ఫాక్స్‌కాన్ కంపెనీ దీనికే మొగ్గు చూపించింది. కృష్ణపట్నం పోర్టు ద్వారా భారీ యంత్రాలను తీసుకొచ్చి, 55వేల చదరపుటగుడుల మేర విస్తీర్ణం ఉన్న 3 ఆర్‌బీఎఫ్ షెడ్లను తీసుకుని ఉత్పత్తిని మొదలుపెట్టేసింది. అనుమతులు సైతం ఆగమేఘాలపై రావటంతో.. రెండున్నర నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభమయింది.

 త్వరలో మరింత విస్తరణ...
 ప్రస్తుతం 55వేల చదరపుటడుగుల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఫాక్స్‌కాన్ సంస్థ... మున్ముందు శ్రీసిటీలోనే భారీ ఎత్తున విస్తరించేలా ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిసింది. అక్కడే కొంత భూమి తీసుకుని శాశ్వత నిర్మాణాలు చేపట్టి భారీగా మొబైల్స్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే పూర్తిగా ఒక్క ప్లాంటుమీదే ఆధారపడినట్లు కాకుండా గుజరాత్‌లో మరో ప్లాంటును కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు చెప్పాయి.
 
 ఏర్పాటు నుంచి గోప్యమే!!
 ఆంధ్రప్రదేశ్‌లోకి ఏదైనా ప్లాంటు వస్తుందంటే... ఒప్పందం నుంచీ ప్రభుత్వం భారీ ప్రచారం చేసుకుంటూనే వస్తోంది. ఫాక్స్‌కాన్ విషయంలో కూడా ఆ సంస్థ రాష్ట్రంలో ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రకటించినా... ప్లాంటు ఏర్పాటై, ఉత్పత్తి కూడా ప్రారంభించినా ఆ విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. అలాగే ఏ కంపెనీ టెంకాయ కొట్టినా, భూమి పూజ చేసినా అదంతా మీడియాకు తప్పనిసరిగా వెల్లడించే శ్రీసిటీ యాజమాన్యం కూడా ఈ విషయంలో గోప్యత పాటించడం గమనార్హం. అయితే ఫాక్స్‌కాన్ ప్రతినిధులు ప్లాంటు ఏర్పాటు, ఉత్పత్తికి సంబంధించిన ఏ సమాచారాన్నీ తెలియజేయవద్దని పట్టుబట్టడమేనని సమాచారం. నిజానికి ప్లాంటు ఫాక్స్‌కాన్‌దే అయినా వేరే పేరిట ఏర్పాటు చేసినట్లు తెలియవచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement