అపోలో ఎయిర్ అంబులెన్స్ మరిన్ని నగరాలకు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగ సంస్థ అపోలో హాస్పిటల్స్ ఎయిర్ అంబులెన్స్ సర్వీసులను మరిన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించింది. వీటిలో వైజాగ్, కాకినాడ, కరీంనగర్‌తోపాటు మధురై, కరైకుడి, కరూర్, త్రిచ్చి, మైసూర్ ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలను అనుసంధానిస్తూ కంపెనీ ఈ అత్యవసర సేవలందిస్తుంది. బెంగళూరుకు చెందిన ఎయిర్ ఏవియేటర్స్ రెస్క్యూ హెలికాప్టర్లను సమకూర్చింది. అత్యవసర పరిస్థితుల్లో బాధితులు, రోగులకు ప్రాథమిక చికిత్స అందించే శిక్షణ పొందిన బృందం ఎయిర్ అంబులెన్సుల్లో ఉంటారు.
బాధితులు, రోగులను మొదట రోడ్డు మార్గంలో అంబులెన్సు ద్వారా సమీపంలోని హెలికాప్టర్ ల్యాండింగ్ జోన్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అపోలో ఆసుపత్రి ఉన్న నగరానికి చేరుస్తారు. పలు ఏవియేషన్ కంపెనీల భాగస్వామ్యంతో ఎయిర్ అంబులెన్స్ సర్వీసులను 2003 నుంచి అపోలో అందిస్తోంది. ఏటా సగటున 125–150 మంది సేవలను వినియోగించుకున్నట్టు కంపెనీ తెలిపింది. ఎయిర్ అంబులెన్స్‌కు గంటకు రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చార్జీ చేస్తారు. అపోలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ నంబరు 1066కు ఫోన్ చేయడం ద్వారా సేవలను పొందవచ్చు.