హాలీవుడ్‌ను మించిన యాపిల్ యాప్స్!
⇒ 2014లో యాపిల్ యాప్ స్టోర్ ఆదాయం 14.3 బిలియన్ డాలర్లు
⇒ హాలీవుడ్ అమెరికా బాక్సాఫీస్ కలెక్షన్స్ 10 బిలియన్ డాలర్లే...
⇒ హాలీవుడ్ స్టార్స్ కన్నా కొందరు యాప్ డెవలపర్ల ఆదాయమే ఎక్కువ
హాలీవుడ్ సినిమాలు కలెక్షన్లలో రికార్డులు బద్దలుగొడుతుంటాయి. కానీ ఆ రికార్డుల్ని యాపిల్ మొబైల్ ఫోన్ షేక్ చేసేస్తోంది. విషయమేమిటంటే గతేడాది మొత్తం హాలీవుడ్ అమెరికా బాక్సాఫీస్ కలెక్షన్ల కంటే యాపిల్ యాప్ స్టోర్ ఆదాయమే ఎక్కువ. అదీ... స్మార్ట్ ఫోన్స్ పవర్.
యాపిల్ గతేడాది విడుదల చేసిన ఐఫోన్ 6, 6 ప్లస్‌లు బంపర్ సక్సెస్ సాధించాయి. దీంతో యాప్‌ల (అప్లికేషన్ల) బిజినెస్ దూసుకెళ్లింది. 2014లో ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌పై పుట్టుకొచ్చిన యాప్‌లతో కంపెనీ అద్భుతాలు సృష్టించింది. గతేడాది చివరి క్వార్టర్లో (అక్టోబర్-డిసెంబర్) యాపిల్ నికర లాభం ఏకంగా లక్ష కోట్ల రూపాయల్ని (18 బిలియన్ డాలర్లు) దాటేసి... ఒక త్రైమాసికంలో ఒక కంపెనీ సాధించిన అత్యధిక లాభంగా నిలిచింది. వీటన్నిటినీ మించి... 2014లో యాపిల్ యాప్ స్టోర్ ద్వారా 14.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతేకాక ఐఫోన్, ఐప్యాడ్‌ల కోసం యాప్‌లు తయారు చేసిన డెవలపర్లకు 10 బిలియన్ డాలర్ల మొత్తాన్ని యాపిల్ చెల్లించింది.
చిత్రమేంటంటే అమెరికాలో హాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్లు గతేడాది దాదాపు 10 బిలియన్ డాలర్లు. అంటే ఎలా చూసినా హాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌ను యాపిల్ మొబైల్ స్క్రీన్ దాటేసిందన్నమాట. 2008లో తొలిసారిగా యాపిల్ యాప్ స్టోర్ ప్రారంభించేటప్పటికి ఈ మొబైల్ యాప్స్ బిజినెస్ అంటే తెలిసినవాళ్లు చాలా తక్కువ. ఇప్పుడు దీనిపైనే ఆధారపడిన సంస్థలు, సాఫ్ట్‌వేర్ నిపుణులు లక్షల్లో ఉండటం యాప్ ‘విశ్వ’రూపానికి తార్కాణం. కొంత మంది హాలీవుడ్ స్టార్స్ వార్షికాదాయం కన్నా కొందరు యాప్ డెవలపర్ల ఆదాయమే ఎక్కువ మరి.
ఆండ్రాయిడ్‌కు చెక్..!
గూగుల్ ఆండ్రాయిడ్ దూకుడుతో కొంత తడబాటుకు గురైన యాపిల్.. మళ్లీ తన సత్తా చాటింది. ప్రధానంగా ఆండ్రాయిడ్ ఓఎస్ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో అగ్రస్థానంలో ఉన్న శామ్‌సంగ్ అమ్మకాల జోరు తగ్గుతున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఆండ్రాయిడ్ యాప్స్ శరవేగంగా దూసుకొచ్చి యాపిల్‌కు సవాలు విసిరినప్పటికీ.. ఐఓఎస్ యాప్స్ డెవలపర్లకే రాబడులు అధికంగా ఉండటంతో రేసులో యాపిల్ మళ్లీ పైచేయి సాధిస్తోంది. యాపిల్ యాప్ స్టోర్ ప్రారంభం నుంచి(2008) ఇప్పటివరకూ డెవలపర్లకు 25 బిలియన్ డాలర్లను యాపిల్ చెల్లించినట్లు అంచనా. అంటే ఒక్క 2014లోనే 40 శాతం మొత్తాన్ని డెవలపర్లు దక్కించుకున్నారు.
14 లక్షలు: యాపిల్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న యాప్స్ సంఖ్య.
(ఇప్పుడున్న గూగుల్ ఆండ్రాయిడ్ యాప్స్ దాదాపు 13 లక్షలు)
50%: యాపిల్ స్టోర్‌లో ఒక్క 2014 ఏడాది యాప్స్ అమ్మకాల్లో వృద్ధి.
50 కోట్ల డాలర్లు: ఈ జనవరి తొలివారంలో యాప్స్‌పై యాపిల్ ఖర్చు.
6,27,000: యాపిల్ యాప్స్ బిజినెస్ ద్వారా అమెరికాలో కొత్తగా పుట్టుకొచ్చిన జాబ్స్.(హాలీవుడ్ సృష్టించిన జాబ్స్ 3,74,000గా అంచనా)
7.5 కోట్లు: గతేడాది చివరి మూడు నెలల్లో(క్యూ4) ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన యాపిల్ ఐఫోన్స్ సంఖ్య.