శాంసంగ్ పై నెగ్గిన ఆపిల్!
వాషింగ్టన్: ఫోన్లో ‘స్లైడ్ టు అన్ లాక్’ ఫీచర్ కు సంబంధించి పేటెంట్ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఆపిల్ సంస్థ.. శాంసంగ్ పై కేసు గెలిచింది. దీంతో శాంసంగ్ ఆపిల్కు 119.6 మిలియన్ డాలర్ల (రూ.796 కోట్లు) పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ‘స్లైడ్ టు అన్ లాక్’ ఫీచర్ను తామే తయారు చేసి, పేటెంట్ పొందామని ఆపిల్ వాదించింది. ఇదే ఫీచర్ ను శాంసంగ్ కూడా వాడడంతో రెండు కంపెనీల మధ్య వివాదం మొదలైంది.
దీనిపై అమెరికాలోని కాలిఫోర్నియా ఫెడరల్ న్యాయస్థానంలో ఫిబ్రవరిలో కేసు నమోదైంది. కేసును విచారించిన న్యాయమూర్తుల బృందం ఆపిల్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆపిల్ ఆవిష్కరణను అక్రమంగా వినియోగించుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై శాంసంగ్ వాదనలు సహేతకంగా లేవని ఫెడరల్ కోర్టు అభిప్రాయపడింది. దీనికి సంబంధించి ఆపిల్ 2.2 బిలియన్ డాలర్ల (సుమారు 14 వేల కోట్లు) పరిహారం కోరగా కేవలం 119.6 మిలియన్ డాలర్ల పరిహారానికి మాత్రమే కోర్టు ఆదేశాలు జారీచేసింది.