అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)
వాషింగ్టన్ : ఆపిల్, జేపీ మోర్గాన్, పెప్సీ వంటి దిగ్గజ కంపెనీలు సైతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధాటికి తట్టుకోలేకపోతున్నాయి. ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకునే హెచ్-1బీ వీసా పాలసీలో ట్రంప్ తీసుకొస్తున్న మార్పులు, దిగ్గజాలను తీవ్రంగా కలవరపెడుతోంది. ఇప్పటికే పలుమార్లు ట్రంప్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. ఆయన నా దారి రహదారి అన్నట్టు ప్రయాణిస్తున్నారు. హెచ్-1బీ వీసా విధానంలో మార్పులపై తాజాగా మరోసారి దిగ్గజ కంపెనీలు ట్రంప్ కార్యాలయానికి తమ గోడును వెల్లబుచ్చుకున్నాయి. ఇమ్మిగ్రేషన్ పాలసీలో ట్రంప్ కార్యాలయం తీసుకుంటున్న మార్పులు.. చాలా ఆందోళకరంగా ఉన్నాయంటూ టాప్ యూఎస్ బిజినెస్ లీడర్లు రాసిన లేఖలో పేర్కొన్నారు. వీరిలో ఆపిల్ ఇంక్ సీఈవో టిమ్ కుక్, జేపీ మోర్గాన్ ఛేజ్ అండ్ కంపెనీ జమీ డిమోన్, పెప్సికో ఇంక్ ఇంద్రా నూయీ ఉన్నారు.
ఈ లేఖలో అత్యంత ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకునే ఇమ్మిగ్రేషన్ విధానం, ట్రంప్ ప్రభుత్వం చేపడుతున్న మార్పులను వీరు ఎక్కువగా ఫోకస్ చేశారు. అస్థిరమైన వలస విధాన నిర్ణయాలు, ఇమ్మిగ్రెంట్ల జీవిత భాగస్వాముల వర్క్ పర్మిట్లను తగ్గించడం వంటి వాటిపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మార్పులతో అనవసరమైన ఖర్చులు, ఇబ్బందులు పెరుగుతాయే తప్ప, పెద్దగా ప్రయోజనాలేమీ ఉండవని సీఈవోలు చెప్పారు. చట్టాన్ని గౌరవించే వేలమంది జీవితాలను అతలాకుతలం చేయొద్దని వేడుకున్నారు. అమెరికాలో పోటీతత్వానికి ఇది గండికొడుతుందని ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు. అమెరికా టాప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లందరూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, ఈ లేఖను రూపొందించారని ఫార్చ్యూన్ రిపోర్టు చేసింది. కాగ, హెచ్-1బీ వీసాలపై పరిమితులు తీసుకొస్తున్న ట్రంప్ కార్యాలయం, అత్యంత ప్రతిభావంతులైన విదేశీయులను నియమించుకోవడం తగ్గించేసింది. అయితే విదేశీ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు వల్ల అమెరికా బాగా ప్రయోజనం పొందుతుందని, ఇప్పుడు వారిపై ఆంక్షలు విధిస్తే అమెరికాలోఆర్థిక వ్యవస్థకే దెబ్బ అని ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment