న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆటో ఎక్స్‌పో 2020 మోటార్ షో ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. తొలి రెండు రోజుల్లో వ్యాపార వర్గాలను అనుమతించనుండగా.. 7 నుంచి 12 దాకా సామాన్య ప్రజలు కూడా సందర్శించవచ్చు. దేశ, విదేశాలకు చెందిన పలు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు ఇందులో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. 15 పైగా స్టార్టప్ సంస్థలు, టెలికం, విద్యుత్ వాహనాల సంస్థలు, సోషల్ మీడియా సంస్థలు ఈ 15వ ఆటో ఎక్స్‌పోలో పాల్గొంటున్నాయి. ‘పర్యావరణ అనుకూలమైన, సురక్షితమైన వాహనాలు, విద్యుత్ వాహనాలు, స్మార్ట్ వాహనాలకు సంబంధించిన కొంగొత్త టెక్నాలజీలను కంపెనీలు ఈ ఎక్స్‌పోలో ప్రదర్శిస్తున్నాయి’ అని భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య... సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ ఈ సందర్భంగా చెప్పారు. సుమారు 60 దాకా ప్యాసింజర్ కార్లు, కమర్షియల్ వాహనాలు, ద్విచక్ర వాహనాలను కంపెనీలు ఈ ఆటో షోలో ఆవిష్కరించనున్నాయి. అయితే, వీటిలో ఎక్కువ భాగం వాహనాలు.. కొత్త బీఎస్–6 కాలుష్య ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేస్తున్న గత మోడల్స్ కొత్త వెర్షన్లే ఉండనున్నాయి. భారతీయ పరిశ్రమల సమాఖ్య... సీఐఐతో పాటు ఏసీఎంఏ, సియామ్ కలిసి ఈ ఆటో ఎక్స్‌పోను నిర్వహిస్తున్నాయి. అమ్మకాల క్షీణత తదితర సమస్యలతో వాహన పరిశ్రమ సతమతమవుతున్న తరుణంలో జరుగుతున్న ఆటోమొబైల్ ఎక్స్‌పో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
బయో ఇథనాల్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన బ్రెజిల్‌కి చెందిన చరకు పరిశ్రమ సమాఖ్య యూనికా, ఇటాలియన్ టైర్ల సంస్థ పిరెలీ, డిజైన్ కంపెనీ ఐకోనా వంటివి ఈ షోలో పాల్గొంటున్నాయి. కొత్త విదేశీ సంస్థల ఉత్పత్తులు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్, ఎఫ్‌ఏడబ్ల్యూ హైమా, ఒలెక్ట్రా, ఎంజీ మోటార్స్ మొదలైనవి కార్లు, ఎస్‌యూవీలు, బస్సులు తదితర వాహనాలను ప్రదర్శించనున్నాయి. తాజా వార్తలు, ఈవెంట్స్‌ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఆటోఎక్స్‌పో 2020 పేజ్‌లలో ఎప్పటికప్పుడు లైవ్‌లో అందించేందుకు సియామ్, ఫేస్‌బుక్ చేతులు కలిపాయి.
జీడబ్ల్యూఎం 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు..
చైనాకు ఎస్‌యూవీ దిగ్గజం గ్రేట్ వాల్ మోటార్స్ (జీడబ్ల్యూఎం) భారత్‌లో బిలియన్ డాలర్ల (సుమారు రూ.7,100 కోట్లు) మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. పరిశోధన.. అభివృద్ధి, తయారీ, సేల్స్..మార్కెటింగ్‌పై ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు జీడబ్ల్యూఎం భారత అనుబంధ సంస్థ డైరెక్టర్ హర్‌దీప్ బ్రార్ తెలిపారు. వచ్చే 3–5 ఏళ్లలో ప్రపంచంలోనే తమకు టాప్ 3 మార్కెట్లలో భారత్ కూడా చేరగలదని విశ్వసిస్తున్నట్లు ఆయన చెప్పారు. బెంగళూరులో తమ పరిశోధనా కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు, దశలవారీగా 3,000 మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు బ్రార్ వివరించారు.
ఎలక్ట్రిక్ వాహనాల సందడి..
ఆటో షోలో కొంగొత్త ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా కొలువుతీరాయి. టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ, ఆల్ట్రోజ్ ఈవీలతో పాటు ‘లో ఫ్లోర్ ఎంట్రీ ఎలక్ట్రిక్ బస్’ను ప్రదర్శిస్తోంది. ఇప్పటికే 100 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, రాబోయే 2–3 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ఇన్‌ఫ్రా మరింత మెరుగుపడగలదని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు. జీడబ్ల్యూఎం తమ హావల్ కాన్సెప్ట్ హెచ్ వాహనాన్ని ఆవిష్కరించింది. దీంతో పాటు విజన్ 2025 ప్యూర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రదర్శిస్తోంది. మారుతీ సుజుకీ.. తమ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వాహనం ‘ఫ్యూచరో–ఈ’ని ఆవిష్కరించింది. ఎంజీ మోటార్ ఇండియా.. కొత్త మార్వెల్ ఎక్స్ వాహనాన్ని ప్రదర్శనకు ఉంచింది.
ధూమ్ షో 2020
Published Thu, Feb 6 2020 5:10 AM | Last Updated on Thu, Feb 6 2020 7:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment