Auto Expo 2020
-
మారుతి జిమ్నీని చూశారా?
సాక్షి, న్యూఢిల్లీ : ఆటో ఎక్స్పో 2020లో దేశీయ అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి తన హవాను చాటుకుంటోంది. నాలుగో తరం జపాన్ మోడల్ వాహనం సుజుకి జిమ్నీని శనివారం ప్రదర్శించింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 75 కిలోవాట్ / 6000 ఆర్పీఎం పవర్, 130 ఎన్ఎమ్ / 4000 ఆర్‌పిఎమ్ గరిష్ట టార్క్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. భారతీయ వినియోగదారుల స్పందనను పరిశీలించేందుకు ఆటో ఎక్స్పో 2020లో ప్రదర్శనకు ఉంచామని మారుతి సీఎండీ కెనిచి అయుకావా వెల్లడించారు. కష్టతరమైన రోడ్లలో కూడా సులువుగా ప్రయాణించేలా దీన్ని రూపొందించినట్టు తెలిపారు. ప్రొఫెషనల్ వినియోగదారుల అంచనాలు, అవసరాలపై సమగ్ర పరిశోధనల ఆధారంగా జిమ్నీని అభివృద్ధి చేశామన్నారు. కాంపాక్ట్ డిజైన్, ఆఫ్-రోడ్ సామర్థ్యాలతో సుజుకి జిమ్నీకి మంచి ఆదరణ లభిస్తోందని, 194 దేశాలలో విక్రయిస్తున్నా మన్నారు. చదవండి : ప్రేమికులు మెచ్చే: ‘ట్విజీ’ బుల్లి కారు, ఆటో ఎక్స్పో: టాప్ ఎలక్ట్రిక్ వాహనాలు , కొత్త ఇంజీన్‌తో ఆకర్షణీయంగా మారుతి ఇగ్నిస్ -
ప్రేమికులు మెచ్చే: ‘ట్విజీ’ బుల్లి కారు
సాక్షి, న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో15 వ ఎడిషన్‌గా కొనసాగుతున్న ఆటో ఎక్స్పో 2020లో ఫ్రెంచ్ కార్ల తయారీ దారు రెనాల్ట్ ప్రేమికులను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన కారును తీసుకొచ్చింది. ట్విజీ పేరుతో మైక్రో ఎలక్ట్రిక్ వాహనం ఈ వాలెంటైన్స్ డే సీజన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. యూరోపియన్ మార్కెట్లో ట్విజీకి మంచి ఆదరణ లభించిందని కంపెనీ తెలిపింది. రెనాల్ట్ ట్విజీ టాటా నానో కంటే చిన్నది. ఇద్దరు వ్యక్తులకు సరిపోతుంది. ఈ టూ సీటర్ ట్విజీలో 6.1 కిలోవాట్ బ్యాటరీని అమర్చింది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి నాలుగు గంటలు పడుతుంది. ఒకసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. విండ్‌స్క్రీన్, ఇరుకైన బాడీ, డోర్స్ , పనోరమిక్ సన్‌రూఫ్ ఇలా క్రేజీ లుక్స్‌తో ప్రేమికులనుఆకట్టుకోవడం ఖాయం. ఈ కారు సింగిల్ డిజిటల్ కన్సోల్‌ను అమర్చారు. ఈ కారును ఇండియాలో లాంచ్ చేసే ప్రణాళిలేవీ కంపెనీ వెల్లడించలేదు. అయితే రెండవ సీటు చాలా ఇరుకుగా వుండటంతో ఆరడుగుల బులెట్‌లాంటి అబ్బాయిలకు, పొడుగు కాళ్ల సుందరిలకు కొంచెం కష్టమే. చదవండి : ఆటో ఎక్స్పో 2020 : టాప్ ఎలక్ట్రిక్ వాహనాలు, కొత్త ఇంజీన్‌తో ఆకర్షణీయంగా మారుతి ఇగ్నిస్ -
ఆటో ఎక్స్పో: టాప్ ఎలక్ట్రిక్ వాహనాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2020లో దేశ, విదేశాల కార్లు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో త్వరలో అమల్లోకి రానున్న బీఎస్-6 నిబంధనల నేపథ్యంలో బీఎస్-6 ఆధారిత బైక్‌లు, ఎలక్ట్రిక్ కార్లపై ఆయా కంపెనీలు ఎక్కువగా దృష్టి పెట్టాయి. టాటా మోటార్స్, మహీంద్రా వంటి స్వదేశీ వాహన తయారీదారుల నుంచి మొదలు గ్లోబల్ బ్రాండ్లు రెనాల్ట్ , కియా మోటార్స్ వరకు, అనేక మంది తయారీదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించాయి. కొత్త లాంచింగ్ దగ్గర నుంచి తొలిసారి ప్రదర్శన వరకు, 2020 ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ వాహనాల సందడే సందడి. ఈ సందర్భంగా ఇప్పటివరకు ప్రదర్శించిన ఈ వాహనాల్లో ప్రముఖంగా నిలిచిన అయిదుకార్లపై ఓ లుక్కేద్దాం. టాటా ఆల్ట్రోజ్ ఈవీ ( ఎలక్ట్రిక్ వాహనం) 2019 జెనీవా మోటార్ షోలో తొలిసారిగా ప్రపంచానికి ఆవిష్కరించిన టాటా ఆల్ట్రోజ్ ఈవీ ఎట్టకేలకు ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో భారత్‌లోకి అడుగుపెట్టింది. టైగర్ ఇ.వి . నెక్సాన్ ఈవీ, ఆల్ట్రోజ్ ఈవీ తరువాత ఇది మూడవ ఎలక్ట్రిక్ కారు.అంతేకాదు భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కానుంది. ఈ ఏడాది చివర్లో లాంచ్ కానున్న టాటా ఆల్ట్రోజ్ ఈవీ .. జిప్ట్రాన్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ టెక్నాలజీతో రానుంది, అంటే ఈ కారు ఒక ఛార్జీతో 250 కిలోమీటర్లు దూసుకుపోతుంది. ఫీచర్లపై పూర్తి స్పష్టత రావాల్సి వుంది. రెనాల్ట్ సీటీ కే-జెడ్ఈ ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో రెనాల్ట్ ఆవిష్కరించిన కారు. సిటీ కె-జెడ్ఈ . ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్విడ్ కారు ఎలక్ట్రిక్ వెర్షన్ . చైనాలో జరిగిన 2019 షాంఘై మోటార్ షోలో మొదటిసారి ప్రదర్శించిన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కే-జెడ్ఈ కాన్సెప్ట్‌పై రూపొందించి, రెనాల్ట్కు చెందిన అతిచిన్న ఈవీ అనిచెప్పవచ్చు. క్విడ్ మాదిరిగా, రెనాల్ట్ సిటీ కే-జెడ్ఈ కూడా సీఎంఎఫ్ ప్లాట్‌ఫాం ఆధారితమే. అయితే ఎలక్ట్రిక్ మోడల్ ప్రస్తుతం చైనాలో మాత్రమే అమ్ముడవుతోంది. మహీంద్రా ఇకేయూవి 100 మహీంద్ర నుంచి అనూహ్యంగా దూసుకొచ్చిన వాహనం ఈకేయూవి 100ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ప్రీ-ప్రొడక్షన్ మోడల్‌ను 2018 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది కంపెనీ. అయితే కంపెనీ దీనిని విడుదల చేసింది, దీని ధర రూ. 8.25 లక్షలు (ఎక్స్-షోరూమ్), ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది. కొత్త స్టైలింగ్‌తో, కొత్త గ్రిల్ బ్లూ ఎలిమెంట్స్‌తో విడుదలైంది. ఎంజీ మార్వెల్ ఎక్స్ ఇది చైనాలోని సాయిక్ గ్రూప్ బ్రాండ్ క్రింద విక్రయించే పూర్తి ఎలక్ట్రిక్ ఎస్యూవీ. దీనిని మోరిస్ గ్యారేజ్ ఇండియా ఇండియాకు తీసుకువచ్చింది. 2017 షాంఘై ఆటో షోలో ప్రదర్శించిన విజన్ ఇ కాన్సెప్ట్ ఆధారంగా మార్వెల్ ఎక్స్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్లతో పాటు హెవీ క్రోమ్ ఎలిమెంట్స్‌ను జోడించుకుని ఎగ్రెసివ్ లుక్‌లో విడుదలైంది. సిల్వర్ స్కిడ్ ప్లేట్, స్పోర్టి అల్లాయ్ వీల్స్, ,వెనుక ఎల్ఈడీ టైలాంప్స్‌తో వస్తుంది. కియా సోల్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీతో కియా మోటార్స్ తీసుకొచ్చిన వాహనం కియా సోల్ వీవీ. ప్రస్తుతం, దక్షిణ కొరియా మరియు ఇతర గ్లోబల్ మార్కెట్లలో అమ్మకానికి ఉన్న కియా సోల్ లిక్విడ్-కూల్డ్ లిథియం-అయాన్ పాలిమర్ 64 కిలోవాట్ల బ్యాటరీతో 450 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.. 2025 నాటికి భారతదేశంలో 16 ఎలక్ట్రిక్ వాహనాలను అందించాలని యోచిస్తున్నట్లు కియా ఇంతకుముందే ప్రకటించింది. ఇందులో భాగమే సోల్ ఈవీ. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, క్వాడ్-ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డీఆర్ఎల్లు, ఎల్ఇడి ఫాగ్ లాంప్స్ , ఎల్ఇడి టైల్ లాంప్‌లతో పాటు, హాట్ అండ్ వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ స్టార్ట్-స్టాప్ స్విచ్ ప్రధాన ఫీచర్లు. చదవండి : మారుతి విటారా బ్రెజ్జా సరికొత్తగా , అదరగొడుతున్న పియాజియో స్కూటీలు -
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం: గౌతమ్ రెడ్డి
న్యూ ఢిల్లీ: న్యూ ఢిల్లీలో అట్టహాసంగా జరుగుతున్న ఆటో ఎక్స్ పో -2020 మోటార్ షోలో భాగస్వామ్యమవడం చాలా సంతోషంగా ఉందని ఏపీ పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆటో ఎక్స్ లో ఏపీ పెవిలియన్ ను మంత్రి గౌతమ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఆటో కాంపోనెంట్ షో 2020లో ఏపీలో తయారై, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రోడ్లపై రయ్‌మని తిరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ పనితీరును మంత్రి గౌతమ్ రెడ్డి ఆసక్తిగా పరిశీలించారు. ఏపీ రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహనాలవైపు మళ్లడానికి సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. పర్యావరణహిత విద్యుత్ వాహనాలే మానవ మనుగడకు శ్రేయస్కరమని మంత్రి స్పష్టం చేశారు. భారతదేశ వాహన సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వైపు మళ్లడం శుభపరిణామమని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వరుస సమావేశాలతో గౌతమ్ రెడ్డి బిజీగా గడిపారు. ముందుగా ‘రెనాల్ట్ ఇండియా’ ఆటో మొబైల్ సీఈవోతో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో మంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యమయ్యేందుకు రెనాల్ట్ ఇండియా సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు వారు మంత్రికి తెలియజేశారు. అనంతరం ‘గ్రేట్ వాల్ మార్ట్’ సంస్థకు చెందిన డైరెక్టర్లతో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీలో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న సానుకూల వాతావరణం, ప్రభుత్వ సహకారం ఎలా ఉంటుందో మంత్రి వారికి వివరించారు. ఆ తర్వాత మహీంద్ర ఆటో మొబైల్స్ సంస్థ ప్రతినిధులతో మంత్రి మేకపాటి సమావేశమయ్యారు. వ్యవసాయంలో కీలకంగా మారిన ట్రాక్టర్ల తయారీలో సంస్థ సరికొత్త ఆలోచనలను మంత్రి అభినందించారు. వ్యవసాయ పరిశ్రమలకు ఊతమిచ్చే అగ్రి ఆటోమొబైల్స్ విషయంలో సంస్థ ఆలోచనలు బాగున్నాయని మంత్రి గౌతమ్ రెడ్డి ప్రశంసించారు. భారత దిగ్గజ ఆటో ఇండస్ట్రీలలో ఒకటైన టాటా మోటార్స్ సంస్థ ప్రతినిధులు మంత్రి గౌతమ్ రెడ్డితో భేటీ అయ్యారు. భవిష్యత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆంధ్రప్రదేశ్నే ఎంచుకుంటామని సంస్థ ప్రతినిధులు మంత్రితో అన్నారు. ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు ఉంటాయని గౌతమ్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తో గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి అందించే నిధులపై మంత్రి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపు గురించి మంత్రి విజ్ఞప్తి చేశారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, విశాఖపట్నం - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి ఆర్థికంగా సహకారంపై నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. ఈ సమావేశాలలో పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం, సలహాదారు శ్రీధర్ లంక, తదితరులు పాల్గొన్నారు. -
సరికొత్త మోడళ్లతో ఆటో ఎక్స్పో సందడి
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడాలో ఆటో ఎక్స్పో 2020 ఉత్సాహంగా ప్రారంభమయింది. ఫిబ్రవరి 7 నుంచి 12వ తేదీ వరకు ఆటో ఎక్స్పో 2020 జరగనున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు తమ వాహనాల ప్రదర్శనతో అలరిస్తున్నారు. కార్లను ఇష్టపడేవారిని ఆకట్టుకునేందుకు కంపెనీలు సరికొత్త మోడళ్లను ఎక్స్‌పోలో ప్రదర్శిస్తున్నారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త క్రెటా కారును ఆటో ఎక్స్పో 2020లో ఆవిష్కరించారు. రెండవ తరం హ్యుందాయ్ క్రెటా 2020 మార్చిలో రానుంది. మొదటి తరం క్రెటాను 2015 దేశంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గత కొద్ది కాలంగా కియా సెల్టోస్, ఎమ్ జీ హెక్టార్ కారణంగా క్రెటా వెనుకబడినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా పోటీని తట్టుకునే విధంగా సరికొత్త హ్యుందాయ్ క్రెటా మోడల్‌ను రూపొందించామని, కియాకు గట్టి పోటీనిచ్చి మార్కెట్లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంటామని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 2020 నుంచి కాలుష్య ఉద్గారాలను నియంత్రించే క్రమంలో అన్ని కంపెనీలు బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా సరికొత్త మోడళ్లను కంపెనీలు ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నాయి. కాగా వోక్స్వ్యాగన్, స్కోడా, ఫోర్స్ మోటార్స్ తదితర బ్రాండ్లు ప్రదర్శనలకు రానున్నట్లు మార్కెట్లు వర్గాలు తెలిపాయి. ఎమ్జీ మోటార్ ఇండియా ఎమ్‌పీవీ జీ10 ప్రీమియమ్ కార్లను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఈ ఏడాదిలో జీ10 కార్లు మార్కెట్లోకి రానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
కొత్త ఇంజీన్‌తో ఆకర్షణీయంగా మారుతి ఇగ్నిస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్ ఇగ్నిస్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. న్యూఢిల్లీలో శుక్రవారం ప్రారంభమైన ఆటో ఎక్స్పో 2020లో దీన్ని లాంచ్ చేసింది. బీఎస్-6 పెట్రోల్ ఇంజీన్‌తో ఇగ్నిస్ వాహనాన్ని అప్‌గ్రేడ్ చేసింది. ఇది ఏడు వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. ప్రస్తుతం ఉన్న రంగుల పాలెట్‌తో పాటు లూసెంట్ ఆరెంజ్ , టర్కోయిస్ బ్లూ అనే రెండు కొత్త రంగులలో లభ్యంకానుంది. సమర్థవంతమైన మన్నిక, విశాలమైన ఇంటీరియర్‌తో ఇగ్నిస్ వాహనం 1.1 లక్షలకు పైగా భారత యూజర్లను బాగా ఆకట్టుకుందని కంపెనీ సీఎండీ కెనిచి ఆయుకావా తెలిపారు. తాజాగా వినియోగదారుల సరికొత్త అంచనాలకనుగుణంగా కొత్త ఇగ్నిస్ సిద్ధంగా ఉందని అన్నారు. కాగా మారుతి సుజుకి నెక్సా పోర్ట్‌ఫోలియోలో ఇగ్నిస్‌కు ప్రత్యేక స్థానం ఉంది . ప్రపంచవ్యాప్తంగా కూడా సుజుకి పోర్ట్‌ఫోలియోలో ఇగ్నిస్‌కు ప్రత్యేక స్థానం లభిస్తుంది. ఇది మొట్టమొదట ఫిబ్రవరి 2016లో జపాన్ మార్కెట్లో లాంచ్ చేయగా, తరువాత ఇండియా, ఐరోపా, ఇతర ప్రపంచ మార్కెట్లకు పరిచయం చేసింది. -
ఆటోకు ఆర్థిక శాఖ తోడ్పాటు..
గ్రేటర్ నోయిడా: కొంగొత్త టెక్నాలజీలపై పరిశోధన, అభివృద్ధి కోసం ఆటోమొబైల్ పరిశ్రమకు తగు తోడ్పాటు అందించాలని ఆర్థిక శాఖను కోరినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. విద్యుత్ వాహనాల తయారీకి, ఎగుమతులకు భారత్ గ్లోబల్ హబ్‌గా ఎదగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆటో ఎక్స్పో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘కొన్నాళ్ల క్రితం రెండు ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరణ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. వాటి నాణ్యత చూశాక, రాబోయే రోజుల్లో ద్విచక్ర వాహనాలైనా.. కార్లయినా.. బస్సులైనా.. విద్యుత్ వాహనాల తయారీ, ఎగుమతుల్లో మనం కచ్చితంగా నంబర్ వన్ కాగలమని నాకు అనిపించింది‘ అని ఆయన చెప్పారు. వాహనాల తుక్కు పాలసీ తుది దశల్లో ఉందని, ఆటోమొబైల్ పరిశ్రమకు ఇది గణనీయంగా మేలు చేయగలదని గడ్కరీ తెలిపారు. మరోవైపు వాహనాలపై జీఎస్టీ తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్‌పై స్పందిస్తూ.. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని గణనీయంగా తగ్గించినట్లు చెప్పారు. భారత దిగుమతుల భారాన్ని, కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాల్లాంటి ప్రత్యామ్నాయ టెక్నాలజీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గడ్కరీ చెప్పారు. ‘శాంత్రోవాలా’.. షారుఖ్.. దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ ఇప్పటిదాకా అనేక కొత్త కార్లు ప్రవేశపెట్టినా.. ఇప్పటికీ తనకు శాంత్రో కారన్నా, శాంత్రో వాలా ప్రకటన అన్నా తనకు చాలా ఇష్టమని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ చెప్పారు. ఆటో ఎక్స్‌పోలో కొత్త క్రెటా ఎస్‌యూవీని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. 22 సంవత్సరాలుగా హ్యుందాయ్‌కి షారుఖ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. గ్రేట్ వాల్ మోటర్స్ ఉత్పత్తి హవల్ ఎఫ్5 ఎస్‌యూవీతో మోడల్స్ ఫోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ కారు ‘ఐడీ క్రాజ్’తో సంస్థ ప్రతినిధులు జేకే మోటర్ స్పోర్ట్స్ పెవిలియన్‌లో రేసింగ్ కారుతో మోడల్స్ ఆటో ఎక్స్‌పోలో సుజుకీ హయబుసా బైక్‌తో మోడల్ -
అదరగొడుతున్న పియాజియో స్కూటీలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ వాహన తయారీ దిగ్గజం పియాజియో ఆటోఎక్స్‌పో 2020లో ద్విచక్రవాహనాల లాంచింగ్‌తో సందడి చేసింది. ఇటలీకి చెందిన పియాజియో తన ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్లో ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ను ఆవిష్కరించింది. అలాగే వెస్పా ఎలెట్రికా అనే ఎలక్ట్రిక్ స్కూటీని కూడా ఈ సంస్థ ప్రదర్శించింది. కొత్త ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ -160 బారామతి ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసినట్టు కంపెనీ తెలిపింది. ఇది అక్టోబర్-డిసెంబర్, 2020లో మార్కెట్లోకి వస్తుందని అంచనా. రానున్న ఐదేళ్లలో ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్‌ను అనుసరించాలని కంపెనీ యోచిస్తోంది. స్థానిక వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని భారతదేశంలో వినూత్న ఎలక్ట్రిక్-మొబిలిటీ వాహనాలను లాంచ్ చేయనుంది. పియాజియో ఇండియా సీఎండీ డియెగో గ్రాఫి మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలను తీర్చగల కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం గర్వంగా ఉందన్నారు. ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 బైక్, 160 సీసీ, 125 సీసీ బీఎస్-6 ఇంజన్ ఆప్షన్లలో వస్తుంది. ఎల్ఈడీ హెడ్, టైల్ లైట్స్, యుఎస్బి ఛార్జింగ్ ఉన్న స్ప్లిట్ గ్లోవ్ బాక్స్, డిజిటల్ క్లస్టర్, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే క్రోమ్ గార్నిష్ ఎగ్జాస్ట్‌తో పాటు 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ ను జోడించింది. బ్లూ, వైట్, రెడ్, బ్లాక్ అనే నాలుగు వేర్వేరు రంగులలో లభిస్తుంది. ఆన్లైన్ ద్వారా బుకింగ్‌లు ఆగస్టు 2020లో ప్రారంభమవుతాయి. చదవండి : మారుతి విటారా బ్రెజ్జా సరికొత్తగా ఆటో ఎక్స్పో సందడి షురూ: కార్ల జిగేల్.. జిగేల్ -
మారుతి విటారా బ్రెజ్జా సరికొత్తగా
సాక్షి, న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2020 లోకొత్త విటారా బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యూవీని మారుతి సుజుకి లాంచ్ చేసింది. దేశంలో అమలు కానున్న ఉద్గార నిబంధనలు నేపథ్యంలో బీఎస్-6 1.5 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజీన్‌తో గురువారం ఆవిష్కరించింది. సరికొత్త వెర్షన్లో ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లను అందిస్తుంది. కాంపాక్ట్ ఎస్‌యూవీలలో విటారా బ్రెజ్జా ఉన్నతంగా నిలిచిందని మారుతి సుజుకి ఇండియా సీఎండీ కెనిచి ఆయుకావా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణ, ప్రీమియంలో వస్తున్న ఆదరణకు తగినట్టుగా, విటారా బ్రెజ్జా మరింత స్పోర్టియర్‌గా మరింత శక్తివంతంగా ఉంటుందని తెలిపారు. కస్టమర్ల నుంచి భారీ స్పందనను ఆశిస్తున్నట్టు తెలిపారు. విటారా బ్రెజ్జా 1.5 లీటర్ కె-సిరీస్ బీఎస్ 6 పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 138 ఎన్ఎం వద్ద 4400 ఆర్పీయం టాప్ ఎండ్ టార్క్, పెప్పీ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2016లో లాంచ్ చేసిన విటారా బ్రెజ్జా వాహనం నాలుగేళ్లలో 500,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయని వెల్లడించింది. చదవండి : ఆటో ఎక్స్పో సందడి షురూ: కార్ల జిగేల్.. జిగేల్ అదరగొడుతున్న పియాజియో స్కూటీలు -
ధూమ్ షో 2020
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆటో ఎక్స్పో 2020 మోటార్ షో ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. తొలి రెండు రోజుల్లో వ్యాపార వర్గాలను అనుమతించనుండగా.. 7 నుంచి 12 దాకా సామాన్య ప్రజలు కూడా సందర్శించవచ్చు. దేశ, విదేశాలకు చెందిన పలు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు ఇందులో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. 15 పైగా స్టార్టప్ సంస్థలు, టెలికం, విద్యుత్ వాహనాల సంస్థలు, సోషల్ మీడియా సంస్థలు ఈ 15వ ఆటో ఎక్స్‌పోలో పాల్గొంటున్నాయి. ‘పర్యావరణ అనుకూలమైన, సురక్షితమైన వాహనాలు, విద్యుత్ వాహనాలు, స్మార్ట్ వాహనాలకు సంబంధించిన కొంగొత్త టెక్నాలజీలను కంపెనీలు ఈ ఎక్స్‌పోలో ప్రదర్శిస్తున్నాయి’ అని భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య... సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ ఈ సందర్భంగా చెప్పారు. సుమారు 60 దాకా ప్యాసింజర్ కార్లు, కమర్షియల్ వాహనాలు, ద్విచక్ర వాహనాలను కంపెనీలు ఈ ఆటో షోలో ఆవిష్కరించనున్నాయి. అయితే, వీటిలో ఎక్కువ భాగం వాహనాలు.. కొత్త బీఎస్–6 కాలుష్య ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేస్తున్న గత మోడల్స్ కొత్త వెర్షన్లే ఉండనున్నాయి. భారతీయ పరిశ్రమల సమాఖ్య... సీఐఐతో పాటు ఏసీఎంఏ, సియామ్ కలిసి ఈ ఆటో ఎక్స్పోను నిర్వహిస్తున్నాయి. అమ్మకాల క్షీణత తదితర సమస్యలతో వాహన పరిశ్రమ సతమతమవుతున్న తరుణంలో జరుగుతున్న ఆటోమొబైల్ ఎక్స్పో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. బయో ఇథనాల్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన బ్రెజిల్‌కి చెందిన చరకు పరిశ్రమ సమాఖ్య యూనికా, ఇటాలియన్ టైర్ల సంస్థ పిరెలీ, డిజైన్ కంపెనీ ఐకోనా వంటివి ఈ షోలో పాల్గొంటున్నాయి. కొత్త విదేశీ సంస్థల ఉత్పత్తులు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్, ఎఫ్ఏడబ్ల్యూ హైమా, ఒలెక్ట్రా, ఎంజీ మోటార్స్ మొదలైనవి కార్లు, ఎస్‌యూవీలు, బస్సులు తదితర వాహనాలను ప్రదర్శించనున్నాయి. తాజా వార్తలు, ఈవెంట్స్‌ను ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఆటోఎక్స్‌పో 2020 పేజ్‌లలో ఎప్పటికప్పుడు లైవ్‌లో అందించేందుకు సియామ్, ఫేస్బుక్ చేతులు కలిపాయి. జీడబ్ల్యూఎం 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. చైనాకు ఎస్యూవీ దిగ్గజం గ్రేట్ వాల్ మోటార్స్ (జీడబ్ల్యూఎం) భారత్‌లో బిలియన్ డాలర్ల (సుమారు రూ.7,100 కోట్లు) మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. పరిశోధన.. అభివృద్ధి, తయారీ, సేల్స్..మార్కెటింగ్‌పై ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు జీడబ్ల్యూఎం భారత అనుబంధ సంస్థ డైరెక్టర్ హర్దీప్ బ్రార్ తెలిపారు. వచ్చే 3–5 ఏళ్లలో ప్రపంచంలోనే తమకు టాప్ 3 మార్కెట్లలో భారత్ కూడా చేరగలదని విశ్వసిస్తున్నట్లు ఆయన చెప్పారు. బెంగళూరులో తమ పరిశోధనా కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు, దశలవారీగా 3,000 మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు బ్రార్ వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాల సందడి.. ఆటో షోలో కొంగొత్త ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా కొలువుతీరాయి. టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ, ఆల్ట్రోజ్ ఈవీలతో పాటు ‘లో ఫ్లోర్ ఎంట్రీ ఎలక్ట్రిక్ బస్’ను ప్రదర్శిస్తోంది. ఇప్పటికే 100 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, రాబోయే 2–3 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ఇన్ఫ్రా మరింత మెరుగుపడగలదని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు. జీడబ్ల్యూఎం తమ హావల్ కాన్సెప్ట్ హెచ్ వాహనాన్ని ఆవిష్కరించింది. దీంతో పాటు విజన్ 2025 ప్యూర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రదర్శిస్తోంది. మారుతీ సుజుకీ.. తమ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వాహనం ‘ఫ్యూచరో–ఈ’ని ఆవిష్కరించింది. ఎంజీ మోటార్ ఇండియా.. కొత్త మార్వెల్ ఎక్స్ వాహనాన్ని ప్రదర్శనకు ఉంచింది. చదవండి : ఆటో ఎక్స్పో సందడి షురూ: కార్ల జిగేల్.. జిగేల్ -
కొత్త టెక్నాలజీతో జియో వెహికల్ ట్రాకింగ్
ఢిల్లీ : ఆటోమోటివ్ ఇండస్ట్రీ టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న వేళ రిలయన్స్ జియో మరో అడుగు ముందుకేసింది. ఆటోమోటివ్ రంగంలో సూపర్ మెకానిక్స్ ద్వారా మాత్రమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ), టెలిమాటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా కూడా నడుస్తుంది. ఢిల్లీలో జరగనున్నఆటో ఎక్స్పో2020లో భాగంగా రిలయన్స్ జియో తన జియో నెట్‌వర్క్‌ను వాహనాలకు కనెక్టివిటీ చేసింది. జియో ప్రవేశపెట్టిన కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోమొబైల్ రంగం సహా పరిశ్రమలలో డిజిటల్ స్వీకరణకు,కస్టమర్ అనుభవాలను వివరించడానికి జియో కృషి చేయనుంది.ఆటో ఎక్స్పో 2020లో వెహికల్ కనెక్టివిటీతో ఆటోమోటివ్ కనెక్టివిటీ సొల్యూషన్స్, సర్టిఫైడ్ డివైజెస్ & హార్డ్‌వేర్ , ఇంటిగ్రేటెడ్ క్లౌడ్ & సర్వీసెస్ ప్లాట్‌ఫామ్, ఇండియా వైడ్ సర్వీసెస్ & సపోర్ట్ నెట్వర్క్ సేవలను జియో అందించనుంది. -
ఆటో ఎక్స్పో: కార్ల జిగేల్.. జిగేల్
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడాలో ఆటో ఎక్స్పో 2020 సంరంభానికి తెరలేచింది. ఫిబ్రవరి 7 నుంచి 12వ తేదీవరకు జరగనున్న ఈ వేడుకనలో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు తమ తమ వాహనాలను ప్రదర్శనకు ఉంచుతాయి. ఈ వేడుకకు ప్రారంభ సన్నాహకం గా ఫిబ్రవరి 5, 6 తేదీల్లో మీడియాకోసం పలు వాహనాలు కొలువు దీరాయి. ముఖ్యంగా మహీంద్ర, మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్తో పాటో, ఫ్రెంచ్ తయారీ దారు రెనాల్ట్ తమ వాహనాలను ఆవిష్కరించాయి. మిషన్ గ్రీన్ మిలియన్ లో భాగంగా రానున్న సంవత్సరాల్లో 10 లక్షల గ్రీన్ కార్లను ( సీఎన్జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్) విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మారుతి వెల్లడించింది. ఈ రోజు మారుతి సుజుకి ఇండియా ఈ రోజు ఆటో ఎక్స్పో 2020 లో ఫ్యూటురో-ఇ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. టాటామోటార్స్ ఫ్రీడం ఇన్‌ప్యూచర్ మొబిలిటీ అనే కాన్సెప్ట్‌తో 13 కార్లను ప్రదర్శించింది. దక్షిణకొరియా దిగ్గజం కియా మోటార్స్ ప్రీమియం సెగ్మెంట్లో మల్టీ పర్పస్ వెహికల్ కార్నివాల్‌ని ఆటోఎక్స్‌పో 2020లో లాంచ్ చేసింది. దీంతోపాటు గ్లోబల్ ఎస్యూవీ ‘సోనెట్’ ను కూడా ప్రదర్శించింది. 2020 ఆటో ఎక్స్‌పోలో హ్యుందాయ్ ఇండియా లే ఫిల్ రూజ్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. -
కార్ల సందడి రెడీ!!
రెండేళ్లకొకసారి జరిగే వాహన పండుగకు రంగం సిద్ధమైంది. పర్యావరణ స్పృహ బాగా పెరిగిన నేపథ్యంలో ఈసారి ఈ ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు బాగా ఉండగలదని నిపుణులు భావిస్తున్నారు. మందగమనం కారణంగా వాహన విక్రయాలు కుదేలయ్యాయని, ఆ ఆటో ఎక్స్పో వినియోగదారుల సెంటిమెంట్‌కు జోష్నివ్వగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ శుక్రవారం (ఈ నెల 7వ తేదీ) నుంచి ఆరంభం కానున్న ఆటో ఎక్స్‌పోకు సంబంధించిన వివరాలు, పాల్గొనే కంపెనీలు, అవి ఆవిష్కరించే మోడళ్లు తదితర అంశాల సమాహారం సాక్షి పాఠకుల కోసం ప్రత్యేకం... ఆర్థిక మందగమనం వాహన రంగాన్ని బాగా దెబ్బతీస్తోంది. గత ఏడాది అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వాహన రంగ రికవరీ ఆటో ఎక్స్‌పోతో ఆరంభం కాగలదని వాహన కంపెనీలు ఆశిస్తున్నాయి. 1986లో మొదలై ప్రతి రెండేళ్లకొకసారి జరిగే ఈ ఆటో ఎక్స్‌పోలో దేశీ, విదేశీ కంపెనీలు తమ వాహనాలను డిస్ప్లే చేయనున్నాయి. కొత్త మోడళ్ల ఆవిష్కరణలకు, మార్కెట్లో ప్రవేశపెట్టడానికి ఆటో ఎక్స్పో వేదికగా పలు వాహన కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి బీఎస్ 6 ప్రమాణాలు అమల్లోకి రానుండటంతో ఈ ఆటో షో ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే అమ్మకాలు తగ్గుతుండటం, బీఎస్ 6 నిబంధనలు అమల్లోకి రానుండటం తదితర కారణాల వల్ల పలు కంపెనీలు ఈ ఆటో ఎక్స్‌పోలో పాల్గొనడం లేదు. కాగా, చైనాకు చెందిన గ్రేట్ వాల్మోటార్స్, ఫా హైమ ఆటోమొబైల్ కంపెనీలు ఈ ఆటో ఎక్స్పో ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. 2018లో జరిగిన ఆటో ఎక్స్‌పోకు సుమారుగా 6 లక్షల మంది సందర్శకులు వచ్చారు. ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోకు కూడా ఇదే స్థాయిలో సందర్శకులు వస్తారనేది నిర్వాహకుల అంచనా. మారుతీ సుజుకీ.... ఈ ఆటో ఎక్స్‌పోలో మారుతీ సుజుకీ కూపే స్టైల్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు ‘ఫ్యూచరో–ఈ’ ను ఆవిష్కరించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భారత కారుగా ఈ కాన్సెప్ట్ కారు నేటి యువత ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉంటుందని మారుతీ పేర్కొంది. దీంతో బీఎస్–6 పెట్రోల్ విటారా బ్రెజా, ఇగ్నిస్ మోడల్లో అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను, స్విఫ్ట్ హైబ్రిడ్ వేరియంట్‌ను, మరో 14 ఇతర మోడళ్లను ప్రదర్శించనున్నది. టాటా మోటార్స్ పలు ఎస్యూవీ మోడళ్లను టాటా మోటార్స్ కంపెనీ ఈ ఆటో ఎక్స్‌పోలో డిస్ప్లే చేయనున్నది. ఏడు సీట్ల ఎస్యూవీ గ్రావిటాస్ మోడల్‌ను ఇక్కడే ఆవిష్కరించనున్నది. ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని, హెచ్2ఎక్స్ కాన్సెప్ట్ కారును, హారియర్ మోడల్లో కొత్త వేరియంట్‌ను ప్రదర్శించడానికి సిద్ధమవుతోంది. స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ స్కోడా, ఫోక్స్‌వ్యాగన్‌లు విలీనమై ఏర్పాటైన స్కోడా ఆటో ఫోక్స్ వ్యాగన్ ఇండియా పలు మోడళ్లను ఈ ఆటో ఎక్స్పో కోసం సిద్ధం చేస్తోంది. టిగుయాన్ ఆల్స్పేస్, టీ–రోక్ ఎస్యూవీ, విజన్ ఇన్, ఆక్టేవియా ఆర్ఎస్245, సూపర్బ్‌లో కొత్త వేరియంట్, కోడియాక్ టీఎస్ఐ, కరోక్ ఎస్‌యూవీలను తెస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్‌యూవీల్లో కొత్త వేరియంట్లతో పాటు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను కూడా డిస్ప్లే చేయనున్నది. ఎక్స్‌యూవీ300, కేయూవీ100 మోడళ్లలో ఎలక్ట్రిక్ వేరియంట్లను కలుపుకొని మొత్తం నాలుగు ఎస్యూవీ ఈవీలను సిద్ధం చేస్తోంది. బీఎస్–6 ప్రమాణాలతో కూడిన అల్టురాస్, ఎక్స్‌యూవీ300, మారాజో వేరియంట్లను ప్రదర్శించనున్నది. వందకు పైగా ఆవిష్కరణలు... దాదాపు 31 కంపెనీలు ఈ ఆటో ఎక్స్‌పోలో పాలుపంచుకోనున్నాయి. దాదాపు వందకు పైగా కొత్త మోడళ్లు, వేరియంట్ల ఆవిష్కరణ జరగనున్నది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన 30కి పైగా స్టార్టప్‌లు కూడా తమ తమ టెక్నాలజీలను, ఉత్పత్తులను డిస్ప్లే చేయనున్నాయి. కాగా కరోనా వైరస్ కారణంగా చైనా ప్రతినిధులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. చైనా కంపెనీలు ఆ ఆటో ఎక్స్‌పోలో పాల్గొంటాయని, ఇక్కడి ఉన్నతాధికారులే వస్తారని, చైనా నుంచి పెద్ద అధికారులెవరూ రారని సమాచారం. కాగా, ఈ ఆటో ఎక్స్పో వినియోగదారుల సెంటిమెంట్‌కు జోష్నివ్వగలదని సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్) డైరెక్టర్ జనరల్ రాజీవ్ మీనన్ ఆశాభావం వ్యక్తంచేశారు. హ్యుందాయ్.... క్రెటా మోడల్లో కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించనున్నది. ఎలంత్ర, ట్యూసన్, ఐ30ఎన్ హ్యాచ్బాక్లతో పాటు నెక్సో ఫ్యూయల్ సెల్ ఎస్‌యూవీని కూడా ప్రదర్శించనున్నది. ఎమ్జీ మోటార్స్ చైనాకు చెందిన ఈ కంపెనీ పలు ఎస్‌యూవీలను ఆ ఆటో ఎక్స్‌పోలో డిస్ప్లే చేయనున్నది. ఐ–విజన్ కాన్సెప్ట్, మాక్సస్ డి90, 6 సీట్ల హెక్టర్, ఎమ్జీ 6 హ్యాచ్‌బ్యాక్, ఎమ్జీ 360 సెడాన్లను సిద్ధం చేస్తోంది. కియా మోటార్స్ ఈ కంపెనీ కార్నివాల్ ఎమ్‌పీవీ(మల్టీ పర్పస్ వెహికల్)ను, క్యూవైఐ ఎస్‌యూవీని, సోల్ ఈవీ, స్ట్రింజర్ జీటీ, స్పోర్టేజ్ క్రాసోవర్, నిరో హ్యాచ్‌బ్యాక్ తదితర కార్లను ప్రదర్శించనున్నది. రెనో ఈ కంపెనీ మొత్తం 12 కార్లను డిస్ప్లే చేయనున్నది. హెచ్‌బీసీ ఎస్యూవీ, జో ఈవీ హ్యాచ్‌బాక్, ట్రైబర్ ఏఎమ్‌టీ, ట్రైబర్ పెట్రోల్ కార్లను ఆవిష్కరించనున్నది. గ్రేట్ వాల్ మోటార్స్ చైనాకు చెందిన ఈ కంపెనీ హావల్, ఓరా బ్రాండ్ ఎస్యూవీ, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించనున్నది. హెచ్9, హెచ్6, హెచ్1 ఎస్‌యూవీలతో పాటు హెచ్, విజన్ 2025 కాన్సెప్ట్ కార్లను డిస్ప్లే చేయనుంది. మెర్సిడెస్ బెంజ్ కొత్త ఏ–క్లాస్ లిమోసిన్, 2020 జీఎల్ఏ, ఈక్యూసీ ఎడిషన్ 1886– ఈ మూడు కార్లను ఆవిష్కరించనుంది. ఏఎమ్‌జీ జీటీ 63 ఎస్ 4మ్యాటిక్ 4 డోర్ల కూపే కారుతో పాటు వి–క్లాప్ మార్కోపోలో కార్లను తీసుకొస్తోంది. ఎప్పుడు: ఈ నెల 7–12 తేదీల్లో ఎక్కడ: ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్‌లో ఇది ఎన్నవ సారి: 15వ సారి పాల్గొనే కంపెనీల సంఖ్య: 30కి పైగా ఆవిష్కరణలు: కొత్త మోడళ్లు, వేరియంట్లు కలుపుకొని 100కు పైగా సందర్శకుల సంఖ్య: 6 లక్షలకు పైగా (అంచనా) ఎవరు నిర్వహిస్తున్నారు: ఏసీఎమ్ఏ (ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్) సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్); కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) -
త్వరలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఇంటర్ సిటీ కోచ్‌లు...
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ బస్‌ల తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ త్వరలో ఇంటర్ సిటీ కోచ్‌లను భారత్‌లో పరిచయం చేయనుంది. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరుగనున్న ఆటో ఎక్స్‌పోలో ఈ మోడల్ బస్‌ను ఆవిష్కరించనుంది. 45 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ కోచ్ ఒకసారి చార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ల దాకా ప్రయాణిస్తుంది. ఇంటర్ సిటీ కోచ్‌ల కోసం దక్షిణ భారతానికి చెందిన ఓ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిన టెండర్లలో లోయెస్ట్ బిడ్డర్‌గా నిలిచామని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఈడీ ఎన్.నాగ సత్యం ‘సాక్షి‘’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి వెల్లడించారు. ఇందులో భాగంగా 50 బస్‌లను సరఫరా చేయనున్నట్టు చెప్పారు. దేశంలో ఇంటర్ సిటీ కోచ్‌లను ప్రవేశపెట్టిన తొలి కంపెనీగా నిలుస్తామన్నారు. చైనాకు చెందిన బ్యాటరీ దిగ్గజం బీవైడీ సహకారంతో ఒలెక్ట్రా పలు మోడళ్లలో ఎలక్ట్రిక్ కోచ్‌లను తయారు చేస్తోంది. హైదరాబాద్‌లో కంపెనీకి ప్లాంటు ఉంది. ఫేమ్–2లో భాగంగా ఒలెక్ట్రా 655 బస్‌లకు ఆర్డర్లను దక్కించుకుంది. -
ఆటో ఎక్స్పో 2020: కంపెనీలు డుమ్మా
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో దీర్ఘకాలిక మందగమనం రానున్న ఆటో ఎక్స్‌పోపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో అట్టహాసంగా జరగనున్న ఈ ఎక్స్‌పోలో దేశీయ కంపెనీలతోపాటు, డజనుకుపైగా కంపెనీలు పాలు పంచుకోవడం లేదు. మరోవైపు ఆటో ఎక్స్పో 2020 లో పాల్గొనకపోడానికి ఆయా కంపెనీలకు వారి వారి సొంత కారణాలున్నప్పటికీ, ఈవెంట్ విజయవంతమవుతుందని పరిశ్రమల బాడీ సియామ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా, టీవీఎస్, హోండా కార్స్ ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్ లిమిటెడ్, ఆడి, బీఎండబ్ల్యూ, ఫోర్డ్, నిస్సాన్, అశోక్ లేలాండ్ వంటి తోపాటు సహా డజనుకు పైగా వాహన తయారీదారులు ఆటోఎక్స్‌పో-2020 కు దూరంగా ఉండనున్నాయి. వీటితోపాటు రాయల్ ఎన్ఫీల్డ్, హార్లే డేవిడ్సన్, ట్రయంఫ్ మోటార్ సైకిల్స్, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, భారత్ బెంజ్, వోల్వో కార్స్ ఇండియా ఉన్నాయి. అయితే ఈ కంపెనీలు ఈవెంట్‌కు గతంలో కూడా డుమ్మాకొట్టాయి. మరోవైపు ఈ లోటును తొలిసారిగా ఈ ఎక్స్‌పోలో పాలుపంచుకుంటున్నఎంజీ మోటార్, గ్రేట్ హవల్ మోటార్స్‌తో పాటు ఫోర్స్ మోటార్స్, అథర్ ఎనర్జీతోపాటు అనేక ఇతర ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్‌లు భర్తీ చేయనున్నాయి. అయితే ఆటో ఎక్స్‌పోతో ఆటోమొబైల్ రంగం మందగమనం నుంచి గట్టెక్కుతుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) ఆశాభావం వ్యక్తం చేసింది. దేశీయంగా కొన్ని కంపెనీలు పాల్గొనకపోవచ్చు, దీనికి వారి సొంత కారణాలు వుండవచ్చు కానీ కొత్తగా వచ్చిన వారి ప్రభావం వుంటుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆటో షోల సంఖ్య కూడా తగ్గుతోందనీ, ఫ్రాంక్ఫర్ట్, టోక్యో వంటి దేశాల్లో కూడా కంపెనీల భాగస్వామ్యం తగ్గిందనీ, దీంతో పాటు మందగమనం, ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకొని ఒకదశలో ఈవెంట్‌ను ఒక సంవత్సరం వాయిదా వేయాలని కూడా ఆలోచించామనీ ఈవెంట్ నిర్వాహకుడు సియామ్ అధ్యక్షుడు రాజన్ వాధేరా చెప్పారు. ఏప్రిల్ 2020 నుంచి అమలుకానున్న బీఎస్-6 కొత్త ఉద్గార నిబంధనలు కూడా ప్రభావం చూపనున్నాయని తెలిపారు. 15వ ఎడిషన్‌గా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి 12 వరకూ జరగనున్న ఈ ఎక్స్పో ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌పోలలో ఒకటిగా నిలవనుందని అంచనా. దేశ రాజధాని ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలోఉన్న గ్రేటర్ నోయిడా వద్ద 235,000 చదరపు మీటర్ల స్థలంతో 58 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించనున్నారు. సుమారు 60కి పైగా కొత్త వాహనాలు విడుదల అవుతాయని, రోజుకు లక్ష మంది సందర్శకులు రావచ్చని సియామ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుగాటో సేన్ భావిస్తున్నారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాలు వరుసగా 9 మాసాల్లో క్షీణతను నమోదు చేశాయి. దీంతో మారుతి సుజుకి, ఆశోక్ లేలాండ్ కంపెనీలు ఉత్పత్తిలో కోత పెట్టాయి. తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేసాయి. అలాగే వేల సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ప్రభావం ఆటో పరిశ్రమల విడిభాగాల కంపెనీలపై కూడా తీవ్రంగా పడింది. దీంతో లక్షలాది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇప్పటివరకు పరిశ్రమల వాల్యూమ్ దాదాపు 16 శాతం క్షీణించింది. ప్రయాణీకుల వాహనాలు 18 శాతం, వాణిజ్య వాహనాలు 22 శాతం, ద్విచక్ర వాహనాల 15.7 శాతం క్షీణించడం ఆటో పరిశ్రమలో సంక్షోభానికి ప్రధాన కారణం. ఆటో ఎక్స్ పో-2018( ఫైల్ ఫోటో)