సాక్షి, న్యూఢిల్లీ: విప్రో ప్రమోటర్ అజీమ్ ప్రేమ్‌జీ, ఆయన భార్య యాసీమ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రేమ్‌జీ గ్రూపు యాజమాన్యంలోని మూడు సంస్థల విలీనం వివాదంలో కర్ణాటక హైకోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కోరుతూ వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యా, రీగల్, నేపియన్ అనే మూడు సంస్థలను హాషమ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీతో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఒక ఎన్ జీవో ఇచ్చిన ఫిర్యాదుపై కోర్టు సమన్లు జారీ చేసిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుందని టైమ్స్ఆఫ్ ఇండియా నివేదించింది.
చెన్నైకి చెందిన ఇండియా అవేక్ ఫర్ ట్రాన్సపరెన్సీ(ఐఏటీ) అనే సంస్థ మూడు కంపెనీలను అక్రమంగా విలీనం చేశారని ఆరోపిస్తూ ప్రేమ్‌జీ దంపతులు సహా, మరో ముగ్గురుపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. మూడు కంపెనీల నుండి 45,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కొత్తగా ఏర్పాటుచేసిన సంస్థకు చట్టవిరుద్ధంగా బదిలీ చేశారని ఆరోపించింది. డైరెక్టర్లుగా ఉన్న నిందితులు 2010-2012 మధ్య ఈ మూడు కంపెనీల 13,602 కోట్ల రూపాయలను ఆస్తులను బహుమతుల రూపంలో తీసుకున్నారని, మిగిలిన 31,342 కోట్ల రూపాయల ఆస్తులను హషమ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌లో విలీనం చేశారని ఐఏటి ఆరోపించింది.
ఈ కేసులో మూడు సంస్థల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఏడాది జనవరి 27న నగర కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే ఈ సమన్లను రద్దు చేయాలని కోరుతూ ప్రేమ్‌జీ, యాసీమ్ ప్రేమ్‌జీ, శ్రీనివాసన్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రాంతీయ డైరెక్టర్ ఎం.ఆర్.భట్, చార్టర్డ్ అకౌంటెంట్ జీ వెంకటేశ్వరరావు హైకోర్టుకు వెళ్లారు. కానీ ఫిర్యాదుదారు ఆరోపణలను సమర్ధించిన కర్ణాటక హైకోర్టు వీరి పిటిషన్ ను మే15 న కొట్టివేసింది. దీంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.
1974 లో ఏర్పడిన విద్యా ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, రీగల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, నేపియన్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు మూడు కంపెనీలు, 1980 లో వాటాలు ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యాయనీ, ఆర్ బీఐ సూత్రప్రాయం ఆమోదంతోపాటు కర్నాటక హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తరువాత 2015 లో హషంతో విలీనం చేశామని ప్రేమ్‌జీ న్యాయవాది మహేష్ అగర్వాల్ పేర్కొన్నట్లు దినపత్రిక నివేదించింది. వ్యాపారవేత్త ఆర్ సుబ్రమణియన్ ఆధ్వర్యంలోని సుభిక్ష సంస్థతో వ్యాపార భాగస్వామ్య వివాదం, 2013లో కోట్ల రూపాయల విలువైన చెక్ బౌన్స్ ఆరోపణలతో ప్రేమ్‌జీ గ్రూపు సుబ్రమణియన్ యాజమాన్యంలోని సంస్థపై క్రిమినల్ ఫిర్యాదు నమోదు చేసింది. ఇది ఇంకా పెండింగ్‌లో ఉంది. దీంతో సుబ్రమణియన్ ప్రోద్బలంతోనే ఐఏటీ తమపై ఆరోపణలు చేస్తోందని అగర్వాల్ వాదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment