
పనాజి: యోగా గురు బాబా రాందేవ్‌కి చెందిన పతంజలి ఆయుర్వేద్ .. త్వరలో దుస్తుల తయారీ విభాగంలో కూడా ప్రవేశించనుంది. వచ్చే ఏడాది వీటిని మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) నిర్వహిస్తున్న ’గోవా ఫెస్ట్ 2018’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బాబా రాందేవ్ వెల్లడించారు. ‘మార్కెట్లోకి మీ కంపెనీ జీన్స్ ఎప్పుడు ప్రవేశపెడుతున్నారు అంటూ అందరూ నన్ను అడుగుతున్నారు. అందుకే వచ్చే ఏడాదిలో దుస్తులు కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించాం. పిల్లలు, పురుషులు, మహిళలు .. అందరికీ సంబంధించిన గార్మెంట్స్ ప్రవేశపెడతాం‘ అని ఆయన వివరించారు. అలాగే.. స్పోర్ట్స్, యోగాకు ఉపయోగపడే గార్మెంట్స్ కూడా ప్రవేశపెడతామని బాబా రాందేవ్ తెలిపారు.
స్వదేశీ దుస్తుల తయారీ విభాగంలోకి అడుగుపెట్టాలని యోచిస్తున్నట్లు ఆయన గతేడాదే తెలిపారు. పతంజలి ఆయుర్వేద్ ప్రతీ ఏడాది ఆర్థికంగా మరింత మెరుగైన పనితీరు సాధిస్తున్నట్లు, త్వరలోనే టర్నోవర్‌పరంగా దేశంలోనే అతి పెద్ద కంపెనీగా ఎదగగలదని బాబా రాందేవ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రచార కార్యక్రమాల కోసం పెద్ద పెద్ద స్టార్స్‌ని తీసుకోకపోవడం వల్ల గణనీయంగా ఆదా అవుతోందని ఆయన చెప్పారు. సాధారణంగా ప్రజానీకంతో తమకు ఉన్న సంబంధాలే .. బ్రాండ్ ఎదుగుదలకు ఉపయోగపడుతోందన్నారు. అయితే, పలు ప్రకటనల నుంచి ఇప్పటికే తాను తప్పుకున్నానని, రాబోయే రోజుల్లో ప్రచార కార్యక్రమాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని రాందేవ్ వివరించారు. ఇతర దేశాలకు కూడా కార్యకలాపాలు విస్తరిస్తున్నామన్నారు. ఆర్థికంగా బలహీన దేశాల్లో వచ్చే లాభాలను మళ్లీ అక్కడే ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించినట్లు రాందేవ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment