ఇక పతంజలి జీన్స్‌.. | Baba Ramdev's Patanjali enters branded apparel space with 'Paridhan' | Sakshi
Sakshi News home page

ఇక పతంజలి జీన్స్‌..

Published Tue, Nov 6 2018 1:31 AM | Last Updated on Tue, Nov 6 2018 1:31 AM

Baba Ramdev's Patanjali enters branded apparel space with 'Paridhan' - Sakshi

న్యూఢిల్లీ: యోగా గురు బాబా రాందేవ్‌ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద తాజాగా బ్రాండెడ్‌ దుస్తుల వ్యాపార విభాగంలోకి ప్రవేశించింది. ’పరిధాన్‌’ బ్రాండ్‌ను ఆవిష్కరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.1,000 కోట్ల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు బాబా రాందేవ్‌ ఈ సందర్భంగా సోమవారమిక్కడ చెప్పారు. పరిధాన్‌ కింద లివ్‌ఫిట్, ఆస్థా, సంస్కార్‌ అనే మూడు బ్రాండ్లు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

‘ఈ ఏడాది 500– 2,500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే 100 స్టోర్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోనున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 1,000 కోట్ల టర్నోవరు లక్ష్యంగా పెట్టుకున్నాం. వీటిని వచ్చే ఏడాది నాటికి ఆన్‌లైన్లో కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం‘ అని రాందేవ్‌ వివరించారు. 2020 నాటికి మొత్తం 500 స్టోర్స్‌ను ఏర్పాటు చేయనున్నామని, వీటిలో చాలామటుకు ఫ్రాంచైజీ విధానంలోనే  ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సంస్కార్‌ బ్రాండ్‌ పూర్తిగా పురుషుల దుస్తుల శ్రేణి కాగా, ఆస్థా బ్రాండ్‌ కింద మహిళల దుస్తులు, లివ్‌ఫిట్‌ బ్రాండ్‌ పేరిట స్పోర్ట్స్‌వేర్‌.. యోగా దుస్తులు మొదలైనవి విక్రయించనున్నట్లు రాందేవ్‌ చెప్పారు.

ఎంఎన్‌సీలతో పోటీ..
తమ బ్రాండ్ల సాయంతో అడిడాస్, ప్యూమా వంటి బహుళజాతి సంస్థలతో పోటీపడనున్నట్లు రాందేవ్‌ చెప్పారు. పరిధాన్‌ దుస్తుల శ్రేణి ధరలు 30– 40 శాతం చౌకగా ఉంటాయని, సామాన్య ప్రజానీకానికి ఉద్దేశించినవని ఆయన వివరించారు. స్థల లభ్యత, డిమాండ్‌ తదితర అంశాల ప్రాతిపదికన మూడు బ్రాండ్లు ఒకే దగ్గర విక్రయించే స్టాండలోన్‌ స్టోర్‌ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని పతంజలి అపారెల్‌ వ్యాపార విభాగం హెడ్‌ కేఎం సింగ్‌ తెలిపారు.

సాధారణంగా టెక్స్‌టైల్‌ రంగంలో బ్రాండెడ్‌ సెగ్మెంట్‌ వాటా 10 శాతం మాత్రమేనని, మిగతా 90 శాతం అసంఘటిత విభాగానికి చెందినవే ఉంటున్నాయని రాందేవ్‌ చెప్పారు. వీటిలో చెప్పుకోతగ్గ భారతీయ బ్రాండ్స్‌ పెద్దగా లేవన్నారు. ‘సామాన్య ప్రజానీకం దేశీ బ్రాండ్‌ దుస్తులను గర్వంగా వేసుకునేలా చేయడం మా లక్ష్యం‘ అని ఆయన పేర్కొన్నారు.  

ఆర్టిఫిషియల్‌ జ్యుయలరీ కూడా..
పరిధాన్‌ బ్రాండ్‌ కింద ఆర్టిఫిషియల్‌ జ్యుయలరీ, వివాహాది శుభకార్యాలకు సంబంధించిన దుస్తులు కూడా ఉంటాయని రాందేవ్‌ చెప్పారు. పతంజలి జీన్స్‌ శ్రేణి రూ. 500 నుంచి మొదలవుతుందని, షర్ట్‌ల ధర రూ. 500–1,700 శ్రేణిలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 90 మంది పైచిలుకు విక్రేతల నుంచి దుస్తులను సోర్సింగ్‌ చేస్తున్నామని, చిన్న.. మధ్య తరహా సంస్థలను ప్రోత్సహిస్తున్నామని ఆయన వివరించారు.

ఇప్పటికే హెర్బల్‌ ఆయుర్వేద, సహజసిద్ధమైన ఉత్పత్తులు, కాస్మెటిక్స్, వ్యక్తిగత సౌందర్య సాధనాలు, పశు దాణా.. బయోఫెర్టిలైజర్లు, పాల ఉత్పత్తులు, ప్యాకేజ్డ్‌ వాటర్‌ తదితర రంగాల్లో వ్యాపారాలు సాగిస్తున్న పతంజలికి ఇది తొమ్మిదో వెంచర్‌ కానుంది. ఇటీవలి కాలంలో గణనీయంగా కార్యకలాపాలు విస్తరించిన పతంజలి.. గత ఆర్థిక సంవత్సరం మాత్రం జీఎస్‌టీ తదితర అంశాల నేపథ్యంలో స్వల్ప వృద్ధితో రూ.12,000 కోట్ల టర్నోవర్‌కు పరిమితమైంది. 2016–17లో సంస్థ టర్నోవర్‌ రూ.10,561 కోట్లు. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 111 శాతం అధికం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement