న్యూఢిల్లీ : భవిష్యత్తులో కూడా బ్యాంకులకు మొండి బకాయిల బెడద తప్పేటట్లు కనిపించడం లేదు. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న వివిధ ఒత్తిడుల నేపథ్యంలో ఈ బకాయిలు 2017 మార్చి కల్లా 6.9శాతం పెరుగుతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. 2015 సెప్టెంబర్ చివర వరకు 5.14శాతంగా ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకు రుణాలు, 2016 సెప్టెంబర్ నాటికి 5.4శాతానికి పెరుగుతాయని రిజర్వు బ్యాంకు తన రిపోర్టులో నివేదించింది.
బ్యాంకుల మూలధన సంపూర్ణత వివరాలు తెలిపే క్యాపిటల్ టు రిస్క్ అసెట్ రేషియో(సీఆర్ఏఆర్) కూడా 2017 మార్చి కల్లా 10.4శాతానికి తగ్గుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదించింది. 2015 సెప్టెంబర్ లో ఇది 12.7 శాతంగా ఉన్నాయి. స్థూల ఆర్థిక అంశాలు స్థూల మొండిబకాయిల పెరగడానికి దోహదంచేస్తున్నాయని, దీనివల్ల ఈ బకాయిలు 6.9శాతానికి పెరిగే అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది.
గత కొద్దికాలంగా దేశీయ వృద్ధి నిదానంగా ఉండటం, అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థికమాద్యం నుంచి ఆర్థికవ్యవస్థలు మెల్లగా కోలుకోవడం, ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకుల్లో నడవడం, టెక్స్ టైల్, ఇంజనీరింగ్ గూడ్స్, లెదర్, జెమ్స్ ఉత్పత్తుల ఎగుమతులు మందగించడం వంటివి బ్యాంకులకు మొండి బకాయిలు పెరగడానికి ప్రధాన కారణంగా పేర్కొంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అంతేకాక, మైనింగ్ ప్రాజెక్టులు నిషేధం, పవర్,స్టీల్ రంగాల్లో ప్రాజెక్టుల క్లియరెన్స్ కు ఆలస్యం కావడం, ముడిసరుకు ధరల్లో ఒడిదుడుకులు, విద్యుత్ ఉత్పత్తి తగ్గి మౌలిక రంగంపై ప్రభావం చూపడం కూడా బ్యాంకుల్లో మొండి బకాయిలు పెరగడానికి దోహదం చేస్తున్నాయని రిపోర్టు పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తీసుకున్న ఎక్కువ రుణాలు మౌలిక రంగానికి సంబంధించినవై ఉన్నాయని తెలిపింది. బ్యాంకుల్లో నెలకొన్న మొండిబకాయిల సమస్య ఉద్దేశించి తయారుచేసిన రిపోర్టులో, ఆ రుణాలను వసూలు చేసుకోవడం కోసం బ్యాంకులకు ప్రత్యేక చర్యలను ప్రతిపాదించింది. రుణాలను రికవరీ చేసుకునే సౌలభ్యం కోసం ఆరు కొత్త రుణాల రికవరీ ట్రైబ్యూనల్స్ ను ఏర్పాటుచేస్తున్నట్టు రిపోర్టు పేర్కొంది.