
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,013 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.977 కోట్లతో పోలిస్తే 4 శాతం వృద్ధి సాధించామని కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.5,354 కోట్ల నుంచి రూ.6,369 కోట్లకు పెరిగినట్లు బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ అష్యూరెన్స్) ఎస్.రవికుమార్ తెలిపారు.
ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైకు షేర్..: గత నెల విక్రయాలు బాగా ఉండటంతో ఫలితాలు కూడా బాగుంటాయనే అంచనాలతో బీఎస్‌ఈలో బజాజ్ ఆటో షేర్ ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.3,473ను తాకింది. అయితే ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో చివరకు 5 శాతం క్షీణించి రూ.3,243 వద్ద ముగిసింది.
బీఎస్‌ఈ లాభం 11 శాతం అప్...
ముంబై: బాంబే స్టాక్ ఎక్సే్చంజ్(బీఎస్‌ఈ) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 11 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.53 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.59 కోట్లకు పెరిగిందని బీఎస్‌ఈ తెలిపింది. ఆదాయం రూ.86 కోట్ల నుంచి 45 శాతం వృద్ధితో రూ.126 కోట్లకు పెరిగిందని బీఎస్‌ఈ ఎమ్‌డీ, సీఈఓ అశీష్‌కుమార్ చౌహాన్ చెప్పారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో బీఎస్‌ఈ షేర్ 2.4 శాతం నష్టపోయి రూ.849 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి రూ.842ను తాకింది.
పోకర్ణ నికరలాభం రూ.14 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో పోకర్ణ నికరలాభం రూ.18.6 కోట్ల నుంచి రూ.14 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు రూ.93 కోట్ల నుంచి రూ.89 కోట్లకు పడిపోయింది. ఏప్రిల్–డిసెంబరు కాలంలో రూ.245 కోట్ల టర్నోవరుపై రూ.33 కోట్ల నికరలాభం పొందింది.
గాయత్రి షుగర్స్‌కు లాభం..
డిసెంబరు క్వార్టరులో గాయత్రి షుగర్స్ రూ.4.7 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.2.6 కోట్ల నికర నష్టం వాటిల్లింది. డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల్లో రూ.99 కోట్ల టర్నోవరుపై రూ.20 కోట్ల నికర నష్టం చవిచూసింది.
రెండింతలైన తాజ్ జీవీకే లాభం..
కన్సాలిడేటెడ్ ఫలితాల్లో తాజ్ జీవీకే హోటల్స్, రిసార్ట్స్ నికరలాభం రెండింతలపైగా పెరిగి రూ.9 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.72 కోట్ల నుంచి రూ.83 కోట్లను తాకింది. ఏప్రిల్–డిసెంబరు మధ్య రూ.205 కోట్ల టర్నోవరుపై రూ.14 కోట్ల నికర లాభం పొందింది.
తగ్గిన న్యూలాండ్ లాభం..
డిసెంబరు త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో న్యూలాండ్ ల్యాబొరేటరీస్ నికరలాభం రూ.3.6 కోట్ల నుంచి రూ.1.2 కోట్లకు పడిపోయింది. టర్నోవరు రూ.135 కోట్ల నుంచి రూ.117 కోట్లకు వచ్చి చేరింది. డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో రూ.363 కోట్ల టర్నోవరుపై రూ.6 కోట్ల నికరలాభం నమోదైంది.
సింఫనీ లాభం 21 శాతం అప్
హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఎయిర్ కూలర్స్ తయారీ సంస్థ సింఫనీ నికర లాభం 21 శాతం పెరిగి రూ. 66 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో లాభం రూ. 55 కోట్లు. మరోవైపు తాజాగా ఆదాయం రూ. 21 శాతం పెరిగి రూ. 180 కోట్ల నుంచి రూ. 217 కోట్లకు చేరింది. రూ. 2 ముఖవిలువ గల షేరు ఒక్కింటికి 50 శాతం (రూ.1) చొప్పున మూడో మధ్యతర డివిడెండు కింద చెల్లించనున్నట్లు సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment