న్యూఢిల్లీ: బిట్ కాయిన్ల వంటి క్రిప్టో కరెన్సీలు పసిడికి ప్రత్యామ్నాయం కాబోవని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) పేర్కొంది. సమర్థమైన పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో వేల సంవత్సరాలుగా బంగారం కొనసాగుతోందని వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థలో క్రిప్టోకరెన్సీలు చోటు దక్కించుకున్నప్పటికీ... ఈ డిజిటల్ ప్రపంచం లోనూ ప్రధానమైన ఆర్థిక అసెట్‌గా బంగారం కొనసాగుతూనే ఉండగలదని తెలిపింది. డబ్ల్యూజీసీ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది.
క్రిప్టో కరెన్సీ మార్కెట్ విలువ ప్రస్తుతం 800 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని, 2017లో బిట్‌కాయిన్ విలువ ఏకంగా 13 రెట్లు పెరిగిందని డబ్ల్యూజీసీ పేర్కొంది. ‘‘ఇది చూసి ఇక రాబోయే రోజుల్లో బంగారం స్థానాన్ని క్రిప్టో కరెన్సీలు ఆక్రమించేస్తాయని కొందరు భావిస్తున్నారు. కానీ బంగారం, క్రిప్టోకరెన్సీలు రెండూ వేర్వేరు సాధనాలే తప్ప ఒకదానికి మరొకటి ప్రత్యామ్నాయం కాదన్నది మా అభిప్రాయం. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో అర్థవంతమైన స్థానం ఉండటం, రేట్లు భారీ హెచ్చుతగ్గులకు లోనుకాకపోవడం, తక్షణం నగదు కింద మార్చుకునే వెసులుబాటు, నియంత్రణ వ్యవస్థల పరిధికి లోబడే ఉండటం వంటివన్నీ బంగారానికి సానుకూలాంశాలు.
కానీ క్రిప్టో కరెన్సీలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. క్రిప్టోకరెన్సీల మార్కెట్ భారీగా ఉన్నప్పటికీ.. బంగారం, ఇతర కరెన్సీలతో పోలిస్తే లావాదేవీల పరిమాణం చాలా తక్కువ’’ అని డబ్ల్యూజీసీ వివరించింది. బంగారం మార్కెట్లో రోజూ 250 బిలియన్ డాలర్ల మేర ట్రేడింగ్ జరుగుతుండగా.. బిట్‌కాయిన్ లావాదేవీలు మాత్రం సగటున 2 బిలియన్ డాలర్ల స్థాయిలోనే ఉంటున్నాయని తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment