41 లక్షలే కాదు, 50 కోట్లు గోవింద | Bitcoin Scam: Delhi Woman Claims People Might Have Lost Rs 50 Crore | Sakshi
Sakshi News home page

బిట్‌కాయిన్‌ స్కాం : 41 లక్షలే కాదు, 50 కోట్లు గోవింద

Published Tue, Mar 20 2018 4:41 PM | Last Updated on Tue, Mar 20 2018 7:21 PM

Bitcoin Scam: Delhi Woman Claims People Might Have Lost Rs 50 Crore - Sakshi

న్యూఢిల్లీ : ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయిన వర్చ్యువల్‌ కరెన్సీ బిట్‌కాయిన్‌కు ఇటీవల భారీగా డిమాండ్‌ క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి గల ప్రధాన కారణం పలు దేశాల్లో దీనిపై నియంత్రణలు తీసుకురావడం, చట్టబద్ధ కరెన్సీగా దీనికి గుర్తించకపోవడం, హ్యాకర్ల నుంచి ఈ కరెన్సీకి భారీగా ముప్పు ఉండటం. ఇప్పటికే పలు దేశాల ప్రభుత్వాలు, రెగ్యులేటరీ సంస్థలు కూడా ఈ కరెన్సీల విషయంలో ప్రజలు మోసం పోయే అవకాశం ఉందని హెచ్చరికలు జారీచేస్తున్నాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో తాజాగా ఢిల్లీకి చెందిన ఓ మహిళ తన వాలెట్‌ నుంచి దాదాపు రూ.41 లక్షల విలువైన బిట్‌కాయిన్లను కోల్పోయినట్టు తెలిసింది. గుర్తు తెలియని వ్యక్తులు తన అకౌంట్‌ను హ్యాక్‌ చేయడంతో, ఈ నగదును కోల్పోయినట్టు ఆమె తెలిపింది. అయితే తాను మాత్రమే కాక, మరికొంత మంది బాధితులు కూడా దాదాపు రూ.50 కోట్లను కోల్పోతున్నట్టు ఆ మహిళ పేర్కొంది.
 
ఈ మేరకు దీనిపై మయూర్‌ విహార్‌ అనే మహిళ, ఆర్థిక నేరాల వింగ్‌ వద్ద తన ఫిర్యాదును నమోదుచేసింది. తొలుత రూ.6.5 లక్షల 6.5 బిట్‌కాయిన్లను కోల్పోయానని, అనంతరం రూ.35 లక్షల పోగొట్టుకున్నట్టు పేర్కొంది. దీనిపై సైబర్‌ సెల్‌ విచారణ ప్రారంభించింది. తన ఫ్రెండ్‌ తనకు బిట్‌కాయిన్లను పరిచయం చేయడంతో, మొదట తాను 0.4 బిట్‌కాయిన్లను 2017 ఫిబ్రవరిలో ఓ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేశానని ఆ మహిళ చెప్పింది. బిట్‌కాయిన్‌లో పెట్టుబడుల కోసం ఆ కంపెనీ ఫైవ్‌-స్టార్‌ హోటల్స్‌లో సెమినార్లను నిర్వహించేదని పేర్కొంది. తన మ్యూచువల్‌ ఫండ్‌ పాలసీ కాలం గడువు తీరి పోయిన తర్వాత ఆ మొత్తాన్ని కూడా బిట్‌కాయిన్‌లోనే పెట్టుబడులుగా పెట్టినట్టు తెలిపింది. 

స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి తన సేవింగ్స్‌ అన్నింటిన్నీ ఆ కంపెనీలోనే ఇన్వెస్ట్‌ చేసినట్టు చెప్పింది. నెలవారీ 12 శాతం రిటర్నులను అందిస్తానని కంపెనీ వాగ్ధానం చేసినట్టు బాధితురాలు పేర్కొంది. 2017 ఆగస్టు వరకు మాత్రమే తనకు రిటర్నులు వచ్చాయని, కానీ అనంతరం నుంచి రిటర్నులు పొందలేదని చెప్పింది. ఎఫ్‌ఎక్స్‌ఆప్షన్స్‌.కామ్‌, క్రిప్టోమైనర్స్‌.కామ్‌, కాయిన్‌స్పేస్‌ప్రాఫిట్‌.కామ్‌, 24ఆప్షన్స్‌.కామ్‌ పేర్లతో మోసగాడు వెబ్‌సైట్లను నిర్వహిస్తున్నాడని బాధితురాలు వెల్లడించింది. కాగ, బిట్‌కాయిన్‌, ఇతర వర్చ్యువల్‌ కరెన్సీలపై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కూడా తన బడ్జెట్‌ ప్రసంగంలో హెచ్చరికలు జారీచేసిన సంగతి తెలిసిందే. బిట్‌కాయిన్‌, ఇతర వర్చ్యువల్‌ కరెన్సీల వాడకాన్ని ప్రభుత్వం నిషేధిస్తున్నట్టు తెలిపారు. ఈ కరెన్సీలను చట్టబద్ధంగా గుర్తించడం లేదన్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా కూడా వీటిపై ఆందోళనలు వ్యక్తం చేసింది.  టెక్‌ పెట్టుబడిదారులు, రియల్‌ ఎస్టేట్‌దారులు, జువెల్లర్స్‌ భారీగా ఈ బిట్‌కాయిన్‌, వర్చ్యువల్‌ కరెన్సీలలో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టు తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement