ఫ్రీగా అయితే చూసేస్తాం!! | Brightcove Report on Online Subscribers | Sakshi
Sakshi News home page

ఫ్రీగా అయితే చూసేస్తాం!!

Published Tue, Jun 18 2019 9:32 AM | Last Updated on Tue, Jun 18 2019 9:32 AM

Brightcove Report on Online Subscribers - Sakshi

ముంబై: ప్రకటనల బెడద ఉన్నప్పటికీ దేశీయంగా 25 శాతం మంది వినియోగదారులు ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్స్‌పై కంటెంట్‌ను ఉచితంగా చూసేందుకే ఇష్టపడుతున్నారు. పరిమితమైన ప్రకటనలతో ఎంతో కొంత చెల్లించి కంటెంట్‌ను వినియోగించుకునేందుకు ఆసక్తి చూపే వారు పాతిక శాతం మంది ఉంటున్నారు. అంతర్జాతీయంగా వీడియో క్లౌడ్‌ సర్వీసులు అందించే బ్రైట్‌కోవ్‌ అనే సంస్థ ‘2019 ఆసియా ఓటీటీ రీసెర్చ్‌ రిపోర్ట్‌’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆన్‌లైన్‌ మార్కెట్‌ రీసెర్చ్, డేటా అనలిటిక్స్‌ సంస్థ యూగవ్‌తో కలిసి దీన్ని రూపొందించింది. భారత్‌లో 1,000 మంది, మొత్తం ఆసియా దేశాల్లో 9,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ప్రకటనల సమస్య లేకపోతే కాస్త ఎక్కువ ఫీజు కట్టేందుకు కూడా సిద్ధమని 14 శాతం మంది దేశీ వినియోగదారులు వెల్లడించారు. మరో 14 శాతం మంది ఇటు ధరను, అటు యాడ్‌ ప్యాకేజీలను తమకు నచ్చినట్లుగా మార్చుకునే ఆప్షన్‌ ఉంటే బాగుంటుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ మాధ్యమంగా సినిమాలు, పాటలు, వీడియోలు మొదలైన కంటెంట్‌ను అందించడాన్ని ఓటీటీగా వ్యవహరిస్తారు.

బ్రేక్‌కు రెండు యాడ్స్‌..
ఇక ఒకసారి బ్రేక్‌ వస్తే రెండు ప్రకటనల దాకా భరించవచ్చని 22 శాతం మంది భారతీయులు పేర్కొనగా, మూడు యాడ్స్‌ కూడా చూసేందుకు 13 శాతం మంది సంసిద్ధత వ్యక్తం చేశారు. ఓటీటీ కంపెనీలు కావాలంటే కొంత యాడ్స్‌ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుని ఇటు సబ్‌స్క్రిప్షన్‌ ఫీజును సాధ్యమైనంతగా తగ్గించే హైబ్రీడ్‌ మోడల్‌ను పాటిస్తే బాగుంటుందని 80% మంది అభిప్రాయపడ్డారు. 

నెలకు 1 డాలరు కన్నా తక్కువ ఫీజు..
దేశీయంగా 37 శాతం మంది సబ్‌స్క్రయిబర్స్‌ ఓటీటీ కంటెంట్‌కి నెలకు 1 డాలరు కన్నా తక్కువ చెల్లించడంపై మొగ్గు చూపుతుండగా, 27% మంది 1–4 డాలర్ల దాకా, 16% మంది 5–9 డాలర్ల దాకా కట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్‌లో 48% మంది ఓటీటీ యూజర్లు సబ్‌స్క్రిప్షన్‌ కొనసాగిస్తుండగా, 19% మంది పునరుద్ధరించుకోలేదు. వీరిలో 60% మంది మళ్లీ భవిష్యత్‌లో ఓటీటీ సర్వీసులకు మళ్లే ఆలోచనలో ఉన్నారు. ఆఫ్‌లైన్‌ డౌన్‌లోడ్స్, మొబైల్‌పై అందుబాటులో ఉండటం, తక్కువ డేటా వినియోగంతో వీడియో స్ట్రీమింగ్‌ అవడం వంటి మూడు ఫీచర్స్‌ను ఎక్కువమంది కోరుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement