సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఆర్థిక సంక్షోభం కారణంగా జీతాలు చెల్లించలేమంటూ మరోసారి చేతులెత్తేసింది. తద్వారా 1.76 లక్షల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు.
జూన్ నెలకు సంబంధించి రూ. 850 కోట్ల విలువైన జీతాలతో పాటు, కార్యకలాపాలను నిర్వహించడం చాలా కష్టంగా మారిందంటూ ప్రభుత్వం నుండి తక్షణ నిధుల ఇన్ఫ్యూషన్ కోరింది. ఈ మేరకు జూన్ 18వ తేదీన బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ బడ్జెట్ , బ్యాంకింగ్ విభాగం, సీనియర్ జనరల్ మేనేజర్ పురన్ చంద్ర , టెలికాం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శికి రాసిన లేఖ రాసారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని, నగదు కొరత కారణంగా సంస్థ కార్యకలాపాలు, సర్వీసుల నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని సంస్థకుమద్దతివ్వాలని కోరింది. జూన్ నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితులున్నాయని, ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిపెట్టుకుని సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
కాగా వేల కోట్లు బకాయిలతో బాధపడుతున్న టెలికాం సంస్థ ఇటీవల సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో చిక్కుకుంది. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికం సంస్థ తన చరిత్రలో తొలిసారిగా సుమారు 1.76 లక్షల మంది ఉద్యోగులకు ఫిబ్రవరి వేతనాలను చెల్లించలేకపోయింది. భారీ నష్టాలను నమోదు చేస్తున్న ప్రభుత్వరంగ సంస్థల్లో టాప్‌లో ఉన్న బీఎస్ఎన్ఎల్ రూ.13,000 కోట్ల రుణ సంక్షోభంలో పడి పోయింది. డిసెంబర్ 2018 నాటికి నిర్వహణ నష్టాలు రూ.90,000 కోట్లకు పైగా మాటేనని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment