ఉద్యోగాలపై ఆటోమేషన్ పిడుగు
► ప్రతీ 10 ఉద్యోగాలకు నాలుగు మాయం
► వాటిలో ఒకటి మన దేశం నుంచే
► 2021 నాటికి గడ్డు పరిస్థితులు
న్యూఢిల్లీ: ఆటోమేషన్ (యాంత్రీకరణ) ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీయనుంది. ఒకవైపు పెరుగుతున్న యువ జనాభాకు అనుగుణంగా అదనపు ఉపాధి అవకాశాల అవసరం ఏర్పడగా... మరోవైపు యాంత్రీకరణ కారణంగా ఎన్నో రంగాల్లో భారీగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 10 ఉద్యోగాల్లో నాలుగు ఆటోమేషన్ కారణంగా మాయం కానున్నాయని నిపుణుల అంచనా.
ఇంజనీరింగ్, తయారీ, ఆటోమొబైల్స్, ఐటీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లోకి ఇప్పటికే ఆటోమేషన్ అడుగు పెట్టేసింది. ఈ ఆటోమేషన్ పరిమాణం పెరుగుతున్న కొద్దీ దిగువ స్థాయి ఉద్యోగాలపై వేటు పడుతుందని నిపుణుల విశ్లేషణ. రానున్న మూడు నుంచి నాలుగేళ్లలో ఆటోమేషన్ పరంగా చెప్పుకోదగ్గ మార్పు చూడొచ్చని పీపుల్ స్ట్రాంగ్ సీఈవో పంకజ్ బన్సాల్ పేర్కొన్నారు. ముం దుగా అత్యధిక ప్రభావం పడే రంగాల్లో తయారీ, ఐటీ, ఐటీ ఆధారిత రంగం, సెక్యూరిటీ సేవలు, వ్యవసాయ రంగాలుంటాయని ఆయన చెప్పారు.
మన దగ్గర 23 శాతం కనుమరుగు...
‘‘2021 నాటికి మా అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 10 ఉద్యోగాల్లో నాలుగు ఆటోమేషన్ కారణంగా కనుమరుగు అవుతాయి. ఇలా కోల్పోయే ప్రతీ నాలుగు ఉద్యోగాల్లో ఒకటి భారత్ నుంచి ఉంటుంది. అంటే ఒక్క మనదేశంలోనే 23 శాతం ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. మన దేశంలో ఏటా 55 లక్షల ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. ఉద్యోగాలకు తగ్గ నైపుణ్యాల లేమి కారణంగా ఈ స్థాయిలో ఉద్యోగాల భర్తీ ఉండడం లేదు. ఆటోమేషన్ ఈ అంతరాన్ని మరింత పెంచనుంది’’ అని పంకజ్ బన్సాల్ వివరించారు.
అసెంబ్లింగ్(పరికరాల అమరిక) విభాగంలో ఐదేళ్ల క్రితం 1,500 ఉద్యోగాలుంటే అవిప్పుడు 500కు తగ్గాయని, కంపెనీల దృష్టి నైపుణ్యాలపై శిక్షణ నుంచి ఆటోమేషన్ వైపు మళ్లిందని కెల్లీ ఓసీజీ ఇండియా దేశీయ డైరెక్టర్ ఫ్రాన్సిస్ పదమదన్ తెలిపారు. ఆటోమేషన్‌తో అన్ని ఉద్యోగాలకు ముప్పు ఉండదని ఫ్రాన్సిస్ అభిప్రాయం. యంత్రాల పర్యవేక్షణకు ఉద్యోగుల అవసరం ఉంటుందని, కేవలం దిగువ స్థాయి ఉద్యోగాలకే ముప్పు ఉంటుందన్నారు. అయితే, తక్కువ నైపుణ్యాలుండి, ఎక్కువ పనిభారం ఉండే ఉద్యోగాలను ఆటోమేషన్ గల్లంతు చేస్తుందని నిపుణులు అంటున్నారు.