నోట్లు డిపాజిట్ చేశారా!!
ఐటీ విషయంలో నిజాయితీగా ఉండండి
పెద్ద నోట్లు రద్దయ్యాయి. బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వీలుకాని వారు రిజర్వు బ్యాంకు కార్యాలయాల్లో డిక్లరేషన్ యిచ్చి జమ చేసే అవకాశం ఇంకా ఉంది. ఈ డిక్లరేషన్ లో చాలా వివరాలివ్వాలి. ఇది మార్చి 31 వరకూ అమల్లో ఉంటుంది. ఆ తరువాత ఏప్రిల్ 1 నుంచి 2017–18 ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. బడ్జెట్లో ఏ మార్పులూ లేకపోతే... 31 జూలై 2017లోగా రిటర్న్‌లు దాఖలు చెయ్యాలి.
మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ...
⇔ నిజంగా బ్యాంకు ద్వారా నవంబర్ 8కి ముందు విత్ డ్రా చేసి... ఖర్చు పెట్టకుండా మిగిలిపోయిన నోట్లను డిపాజిట్ చేసి ఉంటే రిస్కేమీ లేదు.
⇔ మధ్య తరగతి, సామాన్యులు లెక్కలు రాయక్కర్లేదు. కానీ నగదు పుస్తకం లాంటిది రాసిన వారు నవంబర్ 8 నాటి నగదు విలువ తేల్చండి.
⇔ వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు కూడా ఇలా చేయొచ్చు. మీరు జమ చేసిన ప్రతి రూపాయికి (ప్రతి 5 వందల నోటుకి) వివరణ ఉండాలి. దొంగ వివరణ ఇవ్వొద్దు. నిల్వ తేల్చాక అందులోంచి 100, 50, 20, 10 తీసేయండి. మిగిలిన 1000 మరియు 500లతో... డిపాజిట్ చేసిన మొత్తం మీదే దృష్టి పెట్టండి.
⇔ స్థిరాస్తి క్రయవిక్రయాల్లో మీరు తీసుకున్న బ్లాక్ మనీ బ్యాంకు లాకర్ల లోంచి బయటకు తీసి నిజాయితీగా డిపాజిట్ చేసి ఉంటారు. మీ వృత్తి నిపుణుల సలహా మేరకు పన్ను లెక్కించి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి.
⇔ మీ డిపాజిట్లు రూ.2,50,000 వరకు ఎటువంటి వివరణ అడగం అంటున్నారు. అంటే ఒక పాన్ నంబర్‌తో రూ.2,50,000 డిపాజిట్ దాటకూడదు. గత్యంతరం లేకపోతే యింట్లో అందరి చేత బ్యాంకు ఖాతా తెరిపించి మొత్తాన్ని 2,50,000 దాటకుండా డిపాజిట్ చేసి వివరణ ఇవ్వండి.
⇔ మరొక జాగ్రత్త తీసుకోండి.. ఒక పాన్ నెంబర్ కింద ఏడాది కాలంలో రూ.10,00,000 దాటి జమ చేస్తే మీ ఖాతా వివరాలు డిపార్టుమెంటుకి వెళ్తాయి. ఈ పరిధి లోపలే వ్యవహారాలుండాలి. పది లక్షలు దాటినా... వివరణ యివ్వగలిగితే కాగితాలుంటే పర్వాలేదు. అబద్ధం చెప్పొద్దు. ప్రతి వ్యవహారం ‘కాగితాల‘తో చేయండి.. రుజువులు ఏర్పరచుకోండి.
⇔ అవసరమైతే (వ్యాపారస్తులు) యింట్లో కుటుంబీకుల పేరిట టర్నోవర్ చూపించండి. వారి చేత పన్ను కట్టించండి. పాన్ తీసుకోండి.. 30% కట్టవలసిన చోట 20%.. 20% కట్టవలసిన చోట 10% కట్టినా పరవాలేదు.. లాభం సమంజసంగా ఉండాలి.. పూర్తిగా ఎగవేత ప్రయత్నం చేయొద్దు.
⇔ ఐటీ డిపార్టుమెంటు ఆరా తీసినప్పుడు సరైన వివరణ ఇవ్వండి.. మిమ్మల్ని అసెస్‌మెంట్ చేసే అధికారులు ఎంతో సహకారం అందిస్తారు.. అందరి మీద కక్ష సాధింపు చర్యలుండవ్. సామాన్యులెవరూ భయపడనక్కర్లేదు. ప్రస్తుతం మీకు నోటీసు రాకపోయినా.. వస్తుందన్న భయంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. నోటీసు వచ్చిన వెంటనే భయపడొద్దు. అన్ని కాగితాలు, రుజువులు, బ్యాంకు అకౌంట్ కాపీలు, పేయింగ్ స్లిప్పులు, వ్యవహార సంబంధిత పత్రాలు, ఇతరుల దగ్గర్నుంచి కన్ఫర్మేషన్ లెటర్స్.... ఇలా ఎన్నో ఆలోచించుకుని తయారు చేసుకోండి. వ్యవహారాన్ని బట్టి తారీఖుల ప్రకారం ఫైల్ చేసుకోండి. వివరణ రాసుకోండి. అప్పుడు నోటీసు వచ్చిన వెంటనే అధికారులని కలవవచ్చు. అవసరమైనప్పుడు వృత్తి నిపుణుల సహాయం తీసుకోండి. మీ వివరణ సరిగ్గా ఉన్నప్పుడు మీరు భయపడక్కర్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో గరీబ్ కళ్యాణ్ యోజన ప్రకారం ఆదాయాన్ని డిక్లేర్ చేయండి. తద్వారా మీ క్షేమం, సంక్షేమము, శాంతి ఏర్పడుతాయి.