‘లేక్’లో కొంటున్నారా?
సాక్షి, హైదరాబాద్: ప్రతి రోజూ ఎక్కడో అక్కడ అక్రమ నిర్మాణం అనో.. బఫర్ జోన్‌లోనో.. ఎఫ్‌టీఎల్‌లోనో అపార్ట్‌మెంట్ కట్టారనో వింటుంటాం. తక్కువ ధరకు వస్తుందనో లేక లగ్జరీ సదుపాయాలు కల్పిస్తున్నారనో తొందరపడి ముందూ వెనకా ఆలోచించకుండా ఫ్లాట్ కొన్నారో ఇక అంతే సంగతులు. అసలు బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ అంటే ఏంటో తెలుసా? లేకపోతే కష్టపడి సంపాదించిన సొమ్ము కాంక్రీట్ పాలవడం తప్పదంటున్నారు నిపుణులు.
‘బఫర్’ అంటే భయమే..
బఫర్ జోన్ అంటే నీటి పరివాహక ప్రాంతం. చెరువుల నుంచి పల్లపు ప్రాంతాలకు పారుతుంటుంది. దీన్ని అలుగు అంటారు. ఇక్కడి నుంచి పొలాలకు నీరు మళ్లుతుంటుంది. ఈ మధ్య ఉన్న ప్రాంతాన్నే అంటే చెరువుకు, పొలాలకు మధ్య ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారన్నమాట. ఉస్మాన్‌సాగర్ కింద ఉన్న భూములన్నీ బఫర్‌జోన్ కిందికే వస్తాయి. ఈ కింద ఉన్న ప్రాంతాల్లో కట్టడాలు నిర్మించకూడదు. కొనకూడదు కూడా.
ఎఫ్‌టీఎల్ అంటే జేబు నిల్లే..
ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) అంటే చెరువు కట్ట ప్రాంతం. ఈ ప్రాంతం నీటి పారుదల శాఖ విభాగం కిందికొస్తుంది. చెరువు కట్ట ప్రాంతాన్ని ఆనుకొని నగరంలో బడా నిర్మాణాలు వెలుస్తున్నాయి. అయితే వీటిలో ఫ్లాట్ కొనేముందు కొనుగోలుదారులు కొన్ని కీలక పత్రాలు చూడాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఈ ప్రాంతంలోని నిర్మాణాలకు నీటి పారుదల శాఖ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలి.
అలాగే సంబంధిత మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఎంఆర్‌ఓ), జీహెచ్‌ఎంసీ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పసరండోయ్. ఈ మూడు పత్రాల్లో ఏ ఒక్కటి లేకపోయినా సంబంధిత స్థలాన్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికుంది. ఫ్లాట్లు కొన్న కొనుగోలుదారులు కోర్టుకెళ్లినా లాభముండదు.